తెలంగాణ పోరాటం గురించి ప్రపంచం మొత్తం తెలుసు.. తెలంగాణ సంస్కృతి గురించి కొందరికే తెలుసు. అందుకే తెలంగాణ గొప్పదనాన్ని V6 ఛానెల్ వాళ్లు పాటల రూపంలో ప్రతిఒక్కరికీ తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రజలకే సొంతమైన బతుకమ్మ పండుగకు ప్రతి ఏడు చక్కని పాటను రిలీజ్ చేయడం, అందరి అభిమానాన్ని పొందడం V6 కి అలవాటు. ప్రతి ఏడులాగే ఈ సారి కూడా మరో అద్భుతమైన బతుకమ్మ పాటను తీసుకొచ్చింది. పండుగ హుషారుని పెంచింది. “V6 బతుకమ్మ సాంగ్ 2017 ” అనే పేరుతో యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ పాట అందరిని ఆకట్టుకుంటోంది.
కందికొండ అందించిన సాహిత్యం బతుకమ్మ నేపథ్యాన్ని వివరిస్తుండగా, కైలాష్ ఖేర్, రమాదేవిల గాత్రం పండుగ వాతావరణాన్ని కళ్ళకు కడుతోంది. “పంచభూతాల్లోనే బతుకమ్మ, ప్రకృతి అంటేనే బతుకమ్మ, బతుకివ్వమని దండం పెట్టాలె, అలల మీద ఉయ్యాలూగమ్మా ..” అనే పద ప్రయోగాలతో కందికొండ తన అనుభవాన్ని, తెలంగాణ జాతిపై అవగాహనని చాటుకున్నారు. బోలె శవాళీ సమకూర్చిన సంగీతం చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరినీ లేచి డ్యాన్స్ చేయించే విధంగా ఉంది.