ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అనే సామెత గురించి మీకు తెలుసా? చిన్నప్పుడు తెలుగు చదువుకునేటప్పుడు కచ్చితంగా ఈ సామెత గురించి చెబుతారు. పెద్దయ్యాక రాజకీయాలు ఫాలో అయ్యేవాళ్లకు ఈ సామెత తరచూ వినిపిస్తుంది కూడా. ఇప్పుడు ఇదే సామెతను ‘సర్కారు వారి పాట’ సినిమా గురించి వాడుకోవచ్చు. కారణం ఎక్కడ, ఏం మాట్లాడుతున్నాం అనే ఆలోచన లేకుండా ఓ వ్యక్తి చేసిన పనే అని చెప్పొచ్చు. ఇంతకీ ఏమైందంటే…
మొన్నీ మధ్య కర్నూలులో ‘సర్కారు వారి పాట’ సినిమా విజయోత్సవం జరిగింది గుర్తుంది కదా. అందులో మహేష్‌బాబు స్టేజీ ఎక్కి తొలిసారి స్టెప్పులు కూడా వేశాడు. ఆ వేడుకలోనే మరో అద్భుతమైన కార్యక్రమం జరిగింది కూడా. అదే ఓ డిస్ట్రిబ్యూటర్ సినిమా గురించి గొప్పగా చెప్పిన విషయాలు. ”సర్కారు వారి పాట’ నాలుగు రోజుల్లోనే 75 శాతం రికవరీ చేసింది. మహేష్ బాబు కెరీర్‌లో ఇదే మొదటిసారి. ఇక నుంచి ఆటే.. కలెక్షన్స్ వేటే’’ అంటూ ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడేశారు ఆ డిస్ట్రిబ్యూటర్.
అక్కడి వరకు ఆగి ఉంటే బాగానే ఉంటుంది. కానీ సదరు డిస్ట్రిబ్యూటర్ కాస్త డోస్ పెంచాలని అనుకున్నారేమో… ‘‘సర్కారు వారి పాట’ ఇప్పటివరకు నాలుగు వయగ్రాలు కలెక్ట్ చేసింది. వంద రోజుల్లో వంద వయోగ్రాలు కలెక్ట్ చేస్తుంది. వంద రోజుల పండగలో మళ్లీ కలుద్దాం” అంటూ ముగించారు. దీంతో ఆ కార్యక్రమాన్ని స్టేజీ మీద చూస్తున్నవాళ్లు, టీవీలు, మొబైల్స్‌లో చూస్తున్న కాస్త ఇబ్బందికి గురయ్యారు.
వయాగ్రా గురించి మాట్లాడకూడదా అంటే కచ్చితంగా మాట్లాడొచ్చు. అయితే ఏ స్టేజీ మీద ఏం మాట్లాడాలి అనేదే విషయం. అయినా సినిమాలో సంబంధం లేని సీన్‌లో వయాగ్రా గురించి రైటర్/దర్శకుడు రాయడం, హీరో చెప్పడం, దాన్ని ట్రైలర్‌లో పెట్టడం లాంటివి జరిగినప్పుడు… డిస్ట్రిబ్యూటర్‌లో అలా స్టేజీ మీద మాట్లాడటం కరెక్ట్ అనిపిస్తుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా సామెంత ఇందుకే చెప్పాం. అయితే హీరో డైలాగ్, డిస్ట్రిబ్యూటర్ మాటలకు మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్ చూపించారు.