అందరూ కథ ఆలోచన చేసేలోపు, ఆయన పాయింట్ రెడీ చేసుకుంటారు. అందరూ పాయింట్ సిద్ధం చేసేలోపు ఆయన కథ సిద్ధం పూర్తి చేస్తారు. అందరూ కథకు తుది మెరుగులు దిద్దేలోపు ఆయన కథను ఓకే చేసేసుకుంటాడు. అందరూ కథను ఓకే చేసుకునేలోపు ఆయన సినిమా పూర్తి చేసేస్తాడు. ఇదీ ఇన్నాళ్లుగా పూరి జగన్నాథ్ గురించి ఇండస్ట్రీలో వినిపించే మాట. వరుస సినిమాలను వాయు వేగంతో పూర్తి చేసిన ‘అవును మీరు అనుకున్నది నిజమే’ అని కూడా చెప్పకనే చెప్పారు పూరి జగన్నాథ్. అయితే ఏమైందో ఏమో ‘లైగర్’ దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. ఎందుకని.
విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ అనే సినిమాను పూరి జగన్నాథ్ గతేడాది జనవరి 20న ముంబయిలో ప్రారంభించారు. విజయ్‌కి ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అక్కడ 40 రోజుల చిత్రీకరణ పూర్తయ్యాక మార్చిలో కరోనా కారణంగా సినిమాను వాయిదా వేశారు. ఆ తర్వాత ఇటీవల సినిమా మళ్లీ మొదలుపెట్టారు. ఓ 20 రోజుల షూటింగ్ తర్వాత కరోనా ముదరడంతో మళ్లీ వాయిదా వేశారు. అయితే ఇక్కడే రెండు ప్రశ్నలు… ఒకటి సినిమాను 40-50 రోజుల్లో పూర్తి చేసే పూరి… ‘లైగర్’ఎందుకు పూర్తి చేయలేకపోయాడు.
పోనీ తొలి 40 రోజుల్లో కాలేదు కదా… మరి రెండో షెడ్యూల్‌లో కూడా సినిమా ఎందుకు పూర్తి కాలేదు. పూరి స్లో అయ్యాడా? లేక కరోనా పరిస్థితుల కారణంగా ఎందుకు రిస్క్ అని స్లో చేశాడా? లేక కథ అలా డిమాండ్ చేస్తోందా అనేది తెలియాల్సి ఉంది. మామూలుగా పూరి సినిమా ప్రకటించినప్పుడే టైటిల్ చెప్పేస్తాడు. అయితే ఈ సినిమా విషయంలో అలా చెప్పలేదు. ముందు ‘ఫైటర్’ అని చెప్పి, ఆ తర్వాత దానిని వర్కింగ్ టైటిల్ అన్నారు. కొన్నాళ్లకు ‘లైగర్’ అని టైటిల్ చెప్పారు. ఇదంతా పక్కన పెడితే సూపర్‌ఫాస్ట్ పూరి… ఇలా స్లో అయ్యాడేంటి చెప్మా?