టీజర్‌తో సినిమా మీద అంచనాలను చంపేయడం ఎలా? ఈ బృహత్కార్యం ఎలా చేయాలో తెలియకపోతే ఇద్దరు దర్శకుల్ని అడిగితే సరి. ఒకరు ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా తీసిన ఓం రౌత్ (Om Raut), రెండో వ్యక్తి ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా చేస్తున్న వశిష్ట మల్లిడి (Mallidi Vasishta). అవును ఈ రెండు సినిమాలకు ఉన్న హైప్ టీజర్‌తోనే పోయింది. ఇది మేం అనే మాట కాదు. ఆ టీజర్లను చూశాక ఆయా హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాసుకున్న, వాపోయిన విషయమే.
Vishwambhara
ఆ విషయం వదిలేస్తే.. టీజర్ రిలీజ్‌తో సైలెంట్ అయిపోయిన ‘విశ్వంభర’… ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడి వరకు వచ్చాడు, అసలు వస్తాడా లేదా, సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, అసలు షూటింగ్ చేస్తున్నారా లేదా? ఎక్కడా అప్‌డేట్లు లేవేంటి, రిలీజ్ డేట్ చెప్పడం లేదేంటి? ఇలా చాలా ప్రశ్నలు మెగా ఫ్యాన్స్ మెదడులో, వాళ్ల ఎక్స్ ఖాతాల్లో తెగ కనిపిస్తున్నాయి. దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఆ సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్సే.
నిజానికి ‘విశ్వంభర’ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాల్సింది. ఈ మేరకు చాలాసార్లు ప్రకటించారు కూడా. అయితే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం చిరంజీవి (Chiranjeevi) కాస్త వెనక్కి తగ్గారు. అయితే ఆ కాస్త ఎంత అనేది ఇప్పుడు తెలియడం లేదు. వాయిదా ప్రకటించినప్పుడే కొత్త డేట్ చెబుతారు అనుకుంటే, ఇప్పటివరకు చెప్పలేదు. చాలా సినిమాలు రిలీజ్ కోసం కర్చీఫ్‌లు వేసేస్తున్నాయి. చిరంజీవి నుండి అయితే అలాంటి ప్రయత్నమే కనిపించడం లేదు.
అలా అని సినిమా ఆపేశారా అంటే ఇటీవల విదేశాలకు వెళ్లి సినిమా పాటల షూటింగ్ చేసుకుని మరీ వచ్చారు. అయితే చిరంజీవి ఇప్పుడు వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. దుబాయిలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. వచ్చాక తిరిగి షెడ్యూల్ ఉంటుంది అని చెబుతున్నారు. మరి అప్పుడేనా కొత్త పోస్టర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో చూడాలి. పరీక్షలు, ఐపీఎల్ తర్వాతనే సినిమా ఉంటుంది అని అంటున్నారు. ఆ క్లారిటీ ఏదో ఇచ్చేస్తే కుర్రాళ్లు కూడా హ్యాపీనే.