సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా… సామాజిక అంశాల మీద కూడా స్పందిస్తుంటారు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్. ట్విటర్‌లో ఆయన చాలా విషయాల మీద మాట్లాడుతుంటారు. ఒక్కోసారి సమాజంలోని ట్రెండింగ్ అంశాలు, కరెంట్ ఎఫైర్స్ గురించి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో నెటిజన్ల నుంచి రకరకాల స్పందన వస్తుంటుంది. తాజాగా ఆయన కొన్ని జీవిత సత్యాల గురించి ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు, రవితేజకు మధ్య ఆసక్తికర చర్చ కూడా నడిచింది.
“ఇక్కడ ఎవరికీ ఎవరి మీదా నెగెటివిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు’’ అని రాసుకొచ్చారు హరీశ్ శంకర్. అంతేకాదు ‘‘పక్కవాడి ఎవడన్నా అపజయానికి సోలో డ్యాన్స్ వేస్తే, రేపు వాడి అపజయానికి గ్రూప్ డ్యాన్సర్లు రెడీ అవుతారు’’ అంటూ ఒకరి కష్టం చూసి నవ్వొద్దు అనే యాంగిల్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు ఈ విషయాలు మాస్ మహరాజా రవితేజ తనతో చెప్పారని ట్వీట్‌లో రాసుకొచ్చారు.
అలాగే ఇలాంటి విశాల దృక్పథం ఉండబట్టే రవితేజ అన్నయ్య ఎంతో సంతోషంగా ఉంటారని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్వీట్‌కి రవితేజ బదులిస్తూ ‘మరి దీనికి నీ ఎక్సటెన్షన్ పెట్టవేంట్రా’ అని అడిగారు. దానికి రిప్లైగా ‘‘మీకు అన్నీ గుర్తుంటాయ్ అన్నయ్యా.. యు ఆర్ రైట్. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సర్దుకుంటూ పోవడం లేదా మొత్తం సర్దేసుకొని వెళ్లిపోవడం’ ఇదే నా ఎక్స్‌టెన్షన్’ అని హరీశ్ శంకర్ రిప్లై ఇచ్చారు.
అయితే, హరీశ్ శంకర్ (Harish Shankar) ట్వీట్ల వెనుక సంక్రాంతి సినిమాల పరిస్థితి ఉంది అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. పొంగల్ సినిమాల విడుదలకు ముందు, తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి హరీశ్ శంకర్ ఈ ట్వీట్లు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి బరిలో తొలుత నిలిచిన రవితేజ ‘ఈగల్’ నిలిచింది. అయితే అనూహ్య పరిస్థితుల తర్వాత సినిమాను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.