నేచురల్ స్టార్ నాని స్టార్ హీరోలకి ఏమాత్రం తక్కువ కాదు. స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క హిట్ ఇచ్చి రూ.100 కోట్లు కొడతారేమో. కానీ నాని 3 సినిమాలు రిలీజ్ చేసి రూ.100 కోట్లు కొడతాడు.అందులో నాని గొప్ప ఏముంది అనుకుంటారేమో. నాని చేసే 3 సినిమాల పై ఎంతో మంది బ్రతుకుతారు. సినిమా సో సో గా ఉన్నా అతని నటనతో గట్టెక్కించగల సమర్ధుడు. చాలా సినిమాలు నాని పెర్ఫార్మన్స్ పైనే నిలబడ్డాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అతను నటించిన గత 5 సినిమాలు ప్లాప్ అంటూ కొంతమంది పనిగట్టుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘జెర్సీ’ వంటి హిట్ సినిమాని కూడా ప్లాప్ లిస్టుల్లోకి తోసేస్తున్నారు. దీని గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది.
నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ మూవీ ఇటీవల ఓటిటిలో రిలీజ్ అయ్యింది. అప్పుడెప్పుడో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ రేంజ్ ప్లాప్ ఇది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి అంత తీసిపారేసే మూవీ అయితే ఇది కాదు. అమెజాన్ వారికి మంచి వ్యూయర్ షిప్ నే తెచ్చిపెట్టింది ఈ చిత్రం. అలాగే ‘వి’ సినిమాకి కూడా మంచి వ్యూయర్ షిప్ వచ్చింది అలాగే మంచి బిజినెస్ అయ్యింది అని ఆ చిత్రం నిర్మాత దిల్ రాజే ఓ సందర్భంలో తెలియజేసాడు. ‘కృష్ణార్జున యుద్ధం’ డిజాస్టరే… ఎక్కువ రేట్లకు అమ్ముడవ్వడం అలాగే ఆ టైములో ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ వంటి బడా సినిమాలు పోటీగా ఉండడంతో ఆ సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
అటు తర్వాత వచ్చిన ‘దేవదాస్’ చిత్రం ఫలితాన్ని కేవలం నాని అకౌంట్లోనే వేయడం కరెక్ట్ కాదు. ఆ సినిమా కూడా నిర్మాతకి ప్రాఫిటబులే. నాని ‘గ్యాంగ్ లీడర్’ కూడా చాలా వరకు రికవరీ సాధించింది. ఇమేజ్ ను కాపాడుకోవడానికి కొంతవరకు కమర్షియల్ బాట పట్టాలి. అదే నాని చేస్తున్నాడు. నటుడిగా నాని ఫెయిల్ అవ్వలేదు. పనిగట్టుకుని ఇలా విమర్శించడం అతన్ని టార్గెట్ చేయడమే అవుతుంది అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. థియేటర్ల గొప్పతనం గురించి నాని మాట్లాడినప్పటి నుండీ నానిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారనే వదంతులు కూడా ఈ ఇష్యుతో మరింత రెట్టింపు అవుతున్నట్టు స్పష్టమవుతుంది.