తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతగానో ఇష్టపడతారు. ఎంతగా అంటే యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్న సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ అయితే వెళ్లి చూసి మరీ ఎంకరేజ్ చేస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం కూడా. ఫస్ట్ రిలీజ్‌లో డిజాస్టర్ అనిపించుకున్న సినిమాలు సైతం రీరిలీజ్‌లో హిట్ కొట్టాయి. అయితే ఇంత అవకాశం ఉన్నా రజనీకాంత్ సినిమాలు రిలీజ్ చేయడానికి, చేస్తే ఆడటానికి ఇబ్బందిపడుతున్నాయి. అవును, మీరు చదివింది కరెక్టే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఓ సినిమా రీరిలీజ్ అయ్యి తుస్ మంటే…
మరో సినిమా రీరిలీజ్ కోసం ప్లాన్ చేసి పరిస్థితులు కుదరక వెనుకడుగు వేశారు. దీంతో రజనీకాంత్ సినిమాల విషయంలో ఇలా చేసి పరువు తీయొద్దు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. రిలీజ్ అయ్యి ఇబ్బంది పడ్డ సినిమా ‘ముత్తు’ అయితే, రిలీజ్ అంతా ఓకే అనుకున్నక షోలు ఆగిపోయిన సినిమా ‘శివాజీ’. రజనీ కెరీర్‌లో ఈ రెండు సినిమాలు మామూలు విజయం అందుకోలేదు అనే విషయం తెలిసిందే. కానీ రీరిలీజ్ విషయంలో ఇబ్బందిపడ్డాయి.
డిసెంబరు 2న ‘ముత్తు’ రీరిలీజ్ చేశారు. స్పందన బాగుంటుంది అనుకుంటే ‘యానిమల్’ సినిమా మేనియాలో కొట్టుకుపోయింది. అనుకున్నన్ని షోలు కూడా ఈ సినిమాకు పడలేదట. ఇప్పుడు డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘శివాజీ’ సినిమాను ప్లాన్ చేశారు. ఈ మేరకు భారీగా పబ్లిఇటీ కూడా చేశారు. కానీ టికెట్లు తెగకపోవడంతో సినిమా షోల నిర్ణయాన్ని ఆపేశారట. దీంతో రజనీ సినిమాలకు ఇలాంటి పరిస్థితి చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
ఏ సినిమాలు లేనప్పుడు ఇలాంటి రీరిలీజ్‌లు చేస్తే ఓకే. మంచి సినిమా థియేటర్‌లో ఉన్నప్పుడు ఇలా అయితే కష్టం అని తెలియకపోతే ఎలా అని అంటున్నారు. అయితే తమిళనాడులో ఈ ట్రెండ్‌కు మంచి ఆదరణే దక్కుతోంది. తెలుగులో గతంలో వచ్చిన వైబ్స్ అక్కడ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ‘ముత్తు’, ‘అభయ్’, ‘అరుంధతి’ సినిమాలను రీరిలీజ్ చేస్తే మంచి వసూళ్లే వచ్చాయని టాక్.