పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తిరుపతిలోని తారక రామా మైదానంలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఫైనల్ ట్రైలర్ ను కూడా వదిలారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ. ఈ సినిమా పై నిత్యం ఏదో ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతూనే ఉంది.
టీజర్ రిలీజ్ అయ్యాక.. అందులోని పాత్రల తీరుతెన్నులు తప్పుబడుతూ చాలా ట్రోలింగ్ జరిగింది. తర్వాత చిత్ర బృందం తగిన జాగ్రత్తలు తీసుకుని ట్రైలర్ ను వదిలింది. అంతకు ముందు కూడా సీత పాత్రకి కృతి సనన్ ను ఎందుకు తీసుకున్నారు అంటూ పెద్ద రచ్చ జరిగింది. ట్రైలర్ లో ఆమె ఎక్స్ప్రెషన్లు చూశాక అంతా కూల్ అయ్యారు.ఇవన్నీ పక్కన పెడితే.. ‘ఆదిపురుష్’ సినిమాకి దళితులకు ప్రవేశం లేదు అంటూ ఓ ఫేక్ న్యూస్ బయటకి వచ్చింది.
అది పోస్టర్ ద్వారా చెప్పినట్టు కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆ పోస్టర్ కూడా వైరల్ అయ్యింది. ‘‘ రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం, ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో ధర్మం కోసం నిర్మించిన ఈ సినిమాని హిందువులు అందరు తప్పకుండా వీక్షించాలి’’ అంటూ ఈ పోస్టర్ లో ఉంది. ఇది ఒరిజినల్ పోస్టర్ లానే ఉంది. అందుకే దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి.
ఈ సినిమాను (Adipurush) అడ్డుకుంటామని.. వాళ్ళు కూడా పెద్ద రచ్చ చేస్తున్నారు. దీంతో చిత్ర బృందం రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది. ‘ఇది ఫేక్ న్యూస్, ఇలాంటి వాటిని నమ్మొద్దు. ‘ఆదిపురుష్’ టీమ్ కుల, వర్ణ, మతం ఆధారంగా ఎలాంటి వివక్షను చూపకుండా సమానత్వం కోసం గట్టిగా నిలబడుతంది. ఈ చెడును ఎదురించే క్రమంలో మాకు సపోర్ట్ ఇవ్వండి. ‘ఆదిపురుష్’ ప్రతి భారతీయుడిది , చెడుపై మంచి గెలుస్తుంది’ అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి ఈ దుష్ప్రచారం ఎవరు చేశారన్నది తెలియాల్సి ఉంది.