శ్రీలీల భలే క్యూట్‌గా ఉంటుంది… మరీ మాస్ హీరోయిన్ కాకుండా ముద్దు ముద్దుగా నటిస్తే బాగుండు. బాలకృష్ణ నట విశ్వరూపం మనం చాలా సార్లు చూశాం. అయితే తెలంగాణ మాండలికంలో, కొత్త తరహాలో చూపిస్తే బాగుండు. అనిల్ రావిపూడిలోని కామెడీ యాంగిల్ ఇప్పటికే చూపించేశారు. మాస్ అనిల్ రావిపూడి ఫుల్ ప్లెడ్జ్‌లో కనిపిస్తే బాగుండు. ఇలా మూడు రకాలుగా సినిమా జనాలు అనుకున్నారు. వీటన్నింటికి సమాధానం ‘భగవంత్ కేసరి’. అయితే ఈ సినిమా థియేటర్ల నుండి వెళ్లిపోయాక వాళ్లందరికీ వచ్చిన ప్రశ్న …
ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు అని. ఇన్నాళ్లుగా జనాలు వెయిట్ చేసిన ఈ ప్రశ్నకు కూడా సమాధానం వచ్చేసింది. అవును ‘భగవంత్ కేసరి’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే సినిమానే వచ్చేసింది. ఈ నెల 24 నుండి అంటే ఈ రోజు నుండి సినిమాను స్ట్రీమ్ చేస్తున్నట్లు ఓటీటీ పార్ట్‌నర్ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో నేటి నుండి ‘భగవంత్ కేసరి’ మేనియా ఉండబోతోంది. ఇక సినిమా కథ సంగతి చూస్తే…
నేలకొండ భగవంత్ కేసరి (Bhagavanth Kesari) (బాలకృష్ణ) ఓ అడవి బిడ్డ. ఓ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ శిక్ష అనుభవిస్తున్నప్పుడు జైలర్ (శరత్ కుమార్) కూతురు విజ్జి పాప అలియాస్ విజయలక్ష్మి (శ్రీలీల)తో అనుబంధం ఏర్పడుతుంది. విజ్జి పాపని ఆర్మీలో చేర్చాలనేది తన తండ్రి కల. అయితే అనుకోకుండా జైలర్ మరణించడంతో విజ్జి పాప బాధ్యతల్ని భగవంత్ కేసరి తీసుకుంటాడు.
తండ్రి ఆశయాలకు అనుగుణంగా విజ్జి పాపను సింహంలా తయారు చేయాలని అనుకుంటాడు. మరి ఈ ప్రయత్నం ఎలా సాగింది? ఈ క్రమంలో భగవంత్ కేసరికి సైకాలజిస్ట్ కాత్యాయని (కాజల్) ఎలా సాయం చేసింది? అనేది కథ. అయితే భగవంత్ కేసరి గతం ఏంటి? ఎందుకు జైలుకి ఎందుకు వెళ్లాడు? అనేది అసలు కథ. ఈ కథలో బిలియనీర్ రాహుల్ సాంఘ్వీ (అర్జున్ రాంపాల్) ఎందుకొచ్చాడు, ఏం చేశాడు అనేది ఆసక్తికరం.