యంగ్ హీరోయిన్, అందులోనూ కెరీర్ తొలినాళ్లలో ఉంది. ఈ సమయంలో గర్భవతిఆ నటించాలి అంటే అంత ఈజీగా ముందుకురారు. ఎందుకంటే ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే ఇస్తారు అనే భయం. మన సినిమా పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు చాలానే చూశాం కూడా. అయితే కృతి సనన్ అలా ఆలోచించలేదు. అందుకే ఇప్పుడు జాతీయ ఉత్తమ నటి అయ్యింది. ‘మిమి’ సినిమాకుగాను 2021వ సంవత్సరానికి కృతికి ఈ పురస్కారం దక్కింది. దీంతో అసలు కృతి సంగతేంటి అనే రివైజ్ చేస్తే.. ఆమె కెరీర్ అంత సాఫీగా ఏమీ సాగలేదు అని అర్థమవుతుంది.
చాలా మంది సినిమా పరిశ్రమలోకి స్టార్ అవ్వాలనే వస్తారు. కానీ అనుకోకుండా వచ్చి స్టార్ అయినవాళ్లు, అలాగే బెస్ట్ యాక్టర్ అయిన వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. అందులో ఒకరు కృతి సనన్. ఆమె ఎంట్రీ తెలుగు సినిమాలతోనే అయ్యిందనే విషయం మీకు తెలిసిదే. ‘1: నేనొక్కడినే’ సినిమాతో కృతి సినిమాలకు పరిచయమైంది. ఆ తర్వాత ‘దోచెయ్’ అంటూ మరో సినిమా చేసింది. ఈ రెండూ ఆమెకు (Kriti Sanon) సరైన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో బాలీవుడ్‌లో దాదాపు స్థిరపడిపోయింది.
అయితే బాలీవుడ్‌లో ప్రయాణం ఏమంత సజావుగా మొదలవ్వలేదు, సాగలేదు కూడా. ఇంకా ఇప్పటికీ ఆమెకు సరైన ప్లేస్ బాలీవుడ్‌లో లేదు. అయితే ఇప్పుడు నేషనల్ అవార్డు ఏమన్నా ఆమె కెరీర్‌కు బూస్టింగ్ ఇస్తుందేమో చూడాలి. బాలీవుడ్‌లో కృతి దాదాపు స్టార్ హీరోయినే కానీ కాదు అని అనాలి. ఎంట్రీ ‘హీరోపంతి’ అనే హిట్‌తోనే మొదలైంది. ఆ తర్వాత ‘దిల్ వాలే’, ‘బరేలీ కీ బర్ఫీ’, ‘లూకా చుప్పీ’, ‘హౌస్‌ఫుల్ 4’, ‘పానిపట్’ అంటూ మంచి సినిమాలే చేసింది. అయితే కెరీర్‌ను స్టార్ స్థాయికి తీసుకెళ్లలేదు.
గ్లామర్ పాత్రలతో పాటు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను పరుగులు పెట్టిస్తోంది. దానికి ‘ఆదిపురుష్’ రూపంలో దెబ్బపడింది. ఇప్పుడు ఆమె చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. అయితే అవన్నీ చిన్నవే. అయితే ఇప్పుడు అవార్డు ఏమన్నా భారీ సినిమాలవైపు తిప్పుతుందేమో చూడాలి. ఇక ఇటీవలే చిత్రనిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది కృతి సనన్. ‘దో పత్తి’ సినిమాను నిర్మిస్తోంది. అలా ప్రొడ్యూసర్ అయ్యాక హీరోయిన్‌గా అవార్డు అందుకుంది అన్నమాట.