నటరత్న ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో ఎన్నో అపురూపమైన, అద్భుతమైన సినిమాలున్నాయి.. నటరత్న నటించిన రెండు సూపర్ హిట్ ఫిల్మ్స్ నవంబర్ 1 నాటికి బెంచ్ మార్క్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాయి.. అవి.. ‘రక్తసంబంధం’ (60 సంవత్సరాలు), ‘సారంగధర’ (65 సంవత్సరాలు).. ఈ సందర్భంగా ఈ సినిమాల గురించి తెలుసుకుందాం..
‘రక్తసంబంధం’..
‘రక్తసంబంధం’.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచి, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని, ఏనాటికీ వన్నె తరగని అద్భుత, అపూర్వ, అజరామరమైన గొప్ప చిత్రం.. నటరత్న ఎన్టీఆర్, మహానటి సావిత్రి అన్నాచెల్లెళ్లుగా నటించారు. రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించగా.. విక్టరీ మధుసూదన రావు దర్శకత్వం వహించారు.. 01-11-1962న విడుదలైన ఈ చిత్రం 2022 నవంబర్ 1 నాటికి 60 వసంతాలు పూర్తి చేసుకుంటోంది..
తోబుట్టువులుగా ఎన్టీఆర్, సావిత్రి నటనకు తెలుగు ప్రేక్షకులు పరవశించిపోయారు.. అద్భుత కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ‘రక్తసంబంధం’ లో సెంటిమెంట్ హైలెట్.. తమిళ్‌లో జెమినీ గణేశన్, శివాజీ గణేశన్, సావిత్రి నటించగా విజయవంతమైన ‘పాశమలర్’ ఆధారంగా ‘రక్తసంబంధం’ ని తెరకెక్కించారు.. దేవిక, కాంతారావు, సూర్యకాంతం ఇతర పాత్రల్లో కనిపించారు. ఘంటసాల సంగీతం సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఏసీ థియేటర్లలోనూ 100 రోజులాడింది.. విజయవాడ మారుతి టాకీస్‌లో ఏకధాటిగా 148 రోజులాడి స్టేట్ హయ్యస్ట్ రన్నింగ్ పిక్చర్‌గా రికార్డు నెలకొల్పింది..
‘సారంగధర’..
నటరత్న ఎన్టీఆర్, విలక్షణ నటి భానుమతి, విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రల్లో నటించగా ఆబాల గోపాలాన్నీ అలరించిన గొప్ప చారిత్రాత్మక చిత్రం.. ‘సారంగధర’.. మినర్వా పిక్చర్సు వారి నిర్మాణంలో, ఎస్.వి.రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1957 నవంబర్ 1న విడుదలైంది.. 2022 నవంబర్ 1 నాటికి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. రాజ సులోచన, రేలంగి, సురభి బాల సరస్వతి, శాంత కుమారి, చలం, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని కీలకపాత్రలు పోషించిన ‘సారంగధర’కు కథ, మాటలు, పాటలు సీనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల అందించారు..
వేంగి రాజ్యంలో మొదలైన కథ.. పలు ఆసక్తికరమైన పాత్రలతో, ఊహించని సంఘటనలతో కీలక మలుపులు తిరుగుతుంది.. పెద్దలకు అడ్డు చెప్పలేక.. ప్రేమించిన అమ్మాయికీ, మనసుకి నచ్చిన యువతికీ మధ్య నలిగిపోయే యువరాజు ‘సారంగధర’ పాత్రలో తారక రాముని నటన అమోఘం.. కథ, కథనాలు, మాటలు, పాటలు అన్నీ అలరిస్తాయి.. అప్పట్లో ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది.. ‘రక్తసంబంధం’, ‘సారంగధర’ చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రాలుగా మిగిలిపోయాయి..