నటసార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో కల్యాణ్ రామ్ లుక్ టాక్ ఆఫ్ ది ఇండ్ట్రీగా మారిపోయింది. ఎందుకంటే రెగ్యులర్‌గా ఎక్కువ జుట్టుతో కనిపించే కల్యాణ్ రామ్ ఇప్పుడు డిఫరెంట్‌గా షార్ట్ హెయిర్‌లో కనిపించాడు.
పైన మీరు చూస్తున్న ఫొటో ఈ రోజుదే. ఈ రోజు ఉదయాన్నే తారక్, కల్యాణ్ రామ్ కలసి ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చినప్పుడు తీసిన పొటోనే ఇది. తారక్ రీసెంట్‌గా డెవలప్ చేసుకున్న స్లిమ్ లుక్‌లో కనిపించగా.. కల్యాణ్ రామ్ ఇలా తక్కువ జుట్టు, గడ్డంతో కనిపించాడు. దీంతో కల్యాణ్ రామ్‌లో ఈ మార్పేంటి అనే చర్చ మొదలైంది. సినిమా కోసం ఇలా మారాడా, లేక సినిమా సినిమాకు మధ్య గ్యాప్ ఉండటంతో ఇలా మారాడా అనేది తెలియాల్సి ఉంది.
సినిమా కోసమే ఇలా మారాడు అనుకుంటే.. ఆయన నెక్స్ట్ సినిమా ‘బింబిసార’ (Bimbisara) సినిమాకు ప్రీక్వెల్. తొలి సినిమాను తెరకెక్కించిన మల్లిడి వశిష్టనే (Mallidi Vasishta) ప్రీక్వెల్‌ను కూడా హ్యాండిల్ చేస్తారు అని అనుకుంటే.. ఆయన ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా కోసం వెళ్లిపోయారు. దీంతో ‘రొమాంటిక్’ (Romantic) సినిమా ఫేమ్ అనిల్ పాడూరిని (Anil Paduri) ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా కోసమేమైనా ఈ లుక్‌లోకి వచ్చాడా అంటే ఏమో డౌటే అనిపిస్తోంది. ఎందుకంటే అది రాజుల పాత్ర. రాజులు ఇలా ఉండరు కదా.
మరి కల్యాణ్ రామ్ కొత్త లుక్‌కి కారణమేంటా అని చూస్తే.. ఇంకేదైనా మాస్, యాక్షన్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) ఫలితం కాస్త అటు ఇటుగా రావడంతో మరో మాస్ సినిమాతో తిరిగి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని కల్యాణ్ రామ్ చూస్తున్నాడని తెలిసింది.