ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలు సాధించిన స్థాయిలో బాలీవుడ్ సినిమాలు సక్సెస్ సాధించడం లేదనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు వరుసగా థియేటర్లలో డిజాస్టర్ ఫలితాలను అందుకుంటూ ఉండటం బాలీవుడ్ సినీ అభిమానులను సైతం బాధ పెడుతోంది. తాజాగా కరణ్ జోహార్ మరోసారి సౌత్ సినిమాల ఫలితాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టమవుతోందని ఆయన తెలిపారు. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు విజయాలను ఇస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సంవత్సరం విడుదలైన బాలీవుడ్ సినిమాలు భూల్ భూలయ్యా2, గంగూబయి కాఠియావాడి 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. జూన్ నెలలో విడుదలైన బాలీవుడ్ మూవీ జుగ్‌జుగ్‌జీయో కూడా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుందని ఆయన కామెంట్లు చేశారు. ప్రస్తుతం సౌత్ సినిమాల జోరు కొనసాగుతోందని ఈ జోరు కొనసాగుతున్న సమయంలో హిందీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నా ఆ విజయాలు ఎవరికీ కనిపించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ సూపర్ స్టార్లు నటించిన సినిమాలు త్వరలో విడుదలవుతున్నాయని ఈ సినిమాలతో బాలీవుడ్ ట్రాక్ లోకి వస్తుందని ఆయన అన్నారు. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్2 బాలీవుడ్ ను కప్పేశాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుని నిజంగానే రికార్డులు క్రియేట్ చేస్తాయేమో చూడాల్సి ఉంది. సౌత్ సినిమాలకు ప్రస్తుతం హిందీలో కూడా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
పుష్ప ది రూల్, మహేష్ రాజమౌళి కాంబో మూవీ, చరణ్ శంకర్ కాంబో మూవీ, ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.