లోకేశ్ (Lokesh Kanagaraj) సినిమాటిక్ యూనివర్స్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ప్రపంచానికి ఉన్నంత క్రేజ్ ఇంకే దేనికీ లేదు అని చెప్పాలి. దీనికి కారణం ఆ యూనివర్స్‌లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు ఆ స్థాయి విజయాలు సాధించాయి. అలాగే ఆ సినిమాలు చేసిన హీరోలు, వాళ్ల ఇమేజ్ కూడా కారణం. అయితే అసలు ఈ సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన ఎలా వచ్చింది. ఏం జరిగింది అనేది చెప్పబోతున్నారు లోకేశ్ కనగరాజ్.
Lokesh Kanagaraj
ఈ మేరకు ఓ చిన్నపాటి సినిమాను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ప్రకటనను ఇటీవల విడుదల చేశారు. వన్ షాట్, 2 స్టోరీస్, 24 అవర్స్ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ ఎలా? ఎక్కడ మొదలైందన్న విషాలను ప్రీల్యూడ్ రూపంలో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు లోకేశ్ కనగరాజ్. 10 నిమిషాల నిడివి ఉండే ఈ వీడియోకు ‘ఛాప్టర్ జీరో’ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
ఈ స్పెషల్ వీడియో కోసం కోలీవుడ్‌కు యువ నటులు చాలామంది నటిస్తారు అని తెలుస్తోంది. అలాగే లోకేశ్ టీమ్‌లోని సహాయ బృందం కూడా నటిస్తోంది అని చెబుతున్నారు. అయితే ఈ వీడియోను ఎక్కడ, ఎలా స్ట్రీమ్ చేస్తారు అనే విషయంలో సమాచారం ఇంకా ఏమీ రాలేదు. ఇక లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ సంగతి చూస్తే.. కార్తి హీరోగా నటించిన ‘ఖైదీ’ సినిమాతో తన సినిమాటిక్‌యూనివర్స్ ప్రారంభించారు లోకేశ్.
అయితే అప్పటికి సినిమాటిక్ యూనివర్స్ ముచ్చట లేదు. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా వచ్చిన ‘విక్రమ్’ (Vikram) సినిమాకు ‘ఖైదీ’ని (Kaithi) కనెక్ట్ చేసి సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభించారు. ఆ తర్వాత విజయ్ (Vijay Thalapathy) హీరోగా రూపొందిన ‘లియో’ (LEO) సినిమా ఆఖరులో ఎల్‌సీయూను లింక్ చేశారు. ఇప్పడు చేస్తున్న ‘కూలీ’ (Coolie) సినిమాకు సినిమా ప్రపంచానికి సంబంధం లేదు అని చెబుతున్నా.. ఆఖరులో ఏదో మెలిక పెడతారు అనే డౌటానుమానం కూడా ఉంది.