ఇప్పుడంటే మూతి ముద్దులు కూడా బోల్డ్ అంటూ దర్శకనిర్మాతలు హడావుడి చేస్తున్నారు కానీ.. కె.బాలచందర్ గారు తీసిన “అంతులేని కథ”కు మించిన బోల్డ్ కాన్సెప్ట్ ఇప్పటివరకూ ఏ ఒక్క దర్శకుడూ ప్రయత్నించలేదు. భారతీయ కుటుంబాలు, ఇల్లీగల్ రిలేషన్స్ గురించి ఈవీవీ కంటే బోల్డ్ గా ఎవరూ చూపించలేదు. సో, అంతకుమించి తెలుగులో చూపించడానికి ఏమీ లేదు అన్నట్లుగా దాసరి కూడా కొన్ని సినిమాల్లో పేట్రేగిపోయారు. ఇక నవతరం దర్శకుల దగ్గరకి వచ్చేసరికి కుటుంబాల గురించి, పెళ్ళి, ప్రేమ గురించి చెప్పడానికి ఏమీ మిగలలేదు.
దాంతో పాత కథలే కొత్తగా తీస్తూ నెట్టుకొచ్చేస్తున్నారు. అవే సూపర్ హిట్ అవుతున్నాయి కూడా. అయితే.. జయంత్ గాలి అనే ఔత్సాహికుడు ఒక పదడుగులు ముందుకేసి “లవ్ లైఫ్ అండ్ పకోడీ” అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నవతరం ప్రేమజంట కన్ఫ్యూజన్స్ ను, పెళ్లి పట్ల వారికున్న అవగాహనను బాగా చూపించాడు కూడా. అయితే.. ఒక ఇన్సెస్ట్ రిలేషన్ ను కథలో ఇరికించి, దానికి ఓ మోడ్రన్ సొల్యూషన్ చెప్పాడు.
ఈ సినిమా కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేసినప్పటికీ, అందులో ఎంతమంది ఈ భారీ బ్రాడ్ మైండెడ్ కాన్సెప్ట్ కు కనెక్ట్ అవుతారు అనేది ప్రశ్నార్ధకం. దాదాపుగా ఇదే కాన్సెప్ట్ తో కొన్నేళ్ళ క్రితం మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరొగా “సోలో” అనే సినిమా వస్తే నెటిజన్లు ఏకిపడేసారు. ఆఖరికి హీరో స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరి ఈ “లవ్ లైఫ్ అండ్ పకోడీ” విషయంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి.