అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన మూవీ ‘నా సామి రంగ’. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక ప్రమోషన్స్ డోస్ పెంచుతూ ఈరోజు ప్రీ రిలీజ్ వేడుకని కూడా నిర్వహించారు.
ఇందులో భాగంగా నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ.. ” ‘నా సామి రంగ’ సినిమా గురించి చెప్పడానికంటే ముందు తెలుగు సినిమా ప్రేక్షకుల గురించి చెప్పాలి. అప్పట్లో టీవీలు వచ్చినప్పుడు ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా చూడటం మానేస్తారు అన్నారు. కానీ జనాలు థియేటర్ కి రావడం మానలేదు. తర్వాత ఫోన్లు వచ్చాయి. అందులోనే సినిమాలు వస్తున్నాయి ఇక జనాలు థియేటర్ కి రారు అన్నారు. అయినా వచ్చారు. ఓటీటీలు వచ్చాయి… అయినా వస్తున్నారు. కోవిడ్ వచ్చింది.. అయినా థియేటర్ కి రావడం.. సినిమాలు చూడటం వాళ్ళు మానలేదు.
ఇప్పుడు 4 సినిమాలు వస్తున్నాయి. అన్ని సినిమాలను వాళ్ళు చూస్తారు. ముందుగా ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ‘గుంటూరు కారం’ తో వస్తున్నాడు అతనికి ఆల్ ది బెస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చూశాను తేజ సజ్జని.. అతను ఇప్పుడు ‘హను -మాన్’ తో వస్తున్నాడు. అతనికి ఆల్ ది బెస్ట్. 75 సినిమాలు చేసిన మా వెంకీ ‘సైంధవ్’ తో వస్తున్నాడు. అతనికి కూడా ఆల్ ది బెస్ట్. ఇక మా ‘నా సామి రంగ’ కూడా వస్తుంది.
ఇది అలా వచ్చింది ఇలా వచ్చింది.. మేము అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం అని ఇప్పుడు చెప్పను. రిలీజ్ తర్వాత చెబుతాను. అయితే 3 నెలల్లో సినిమా ఫినిష్ చేయడానికి సహకరించిన టెక్నీషియన్లు,నటీనటులు అందరికీ థాంక్స్. ముఖ్యంగా కీరవాణి గారు.. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే 3 పాటలు ఇచ్చేశారు. తర్వాత ఆర్.ఆర్ కంప్లీట్ చేసేశారు. అలా అందరికీ థాంక్స్ చెప్పుకోవాలి.అందుకోసం 3 నెలల్లో సినిమా ఎలా తీయాలో ఓ పుస్తకం రాస్తాను. ఈ సంక్రాంతికి కిష్టయ్య వస్తున్నాడు బాక్సాఫీస్ ని కొడుతున్నాడు” అంటూ చెప్పుకొచ్చారు.