మన హీరోలకు డేరింగ్ ఎక్కువ.. రిస్కీ ఫైట్లను కూడా డూప్ లేకుండా చేసేస్తారు. గత కొన్నేళ్లుగా ఈ మాట మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మనం ఈ మాట అనుకున్నప్పుడల్లా చాలామంది హీరోలు మన కళ్ల ముందు కదలాడతారు. ఎందుకంటే అంతమంది కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు రిస్కీ షాట్లకు డూప్‌లు లేకుండా చేశారు కాబట్టి. త్వరలో ఈ మాటలు మనం అంత ఈజీగా చెప్పలేం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కారణం.. డూప్‌ల వాడకం తెలుగు చిత్ర పరిశ్రమలో పెరిగిపోవడమే అంటున్నారు.
అవును, గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా చిత్రీకరణలో డూప్‌ల వినియోగం క్రమంగా పెరుగుతోందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారాలు, అనౌన్స్‌మెంట్లు లాంటివి ఏమీ ఉండవు అనే విషయం తెలిసిందే. అయితే మన హీరోల డూప్‌ల వినియోగం క్రమంగా పెరుగుతుండటంతో ఈ విషయం వైరల్‌గా మారింది. దీంతో ఒకప్పటిలా క్లోజప్ షాట్ల దగ్గరకొచ్చేసరికి హీరోలు.. లాంగ్ షాట్లు, రిస్కీ షాట్లు వచ్చేసరికి డూప్‌లు చేస్తున్నారట. షూటింగ్‌ల సందర్భంగా గాయాలు, ఇతర సమస్యల కారణంగా హీరోలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
నిజానికి గతంలో ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అంటే డూప్‌లు పక్కాగా ఉండేవారు. ముందుగా చెప్పినట్లు క్లోజప్ షాట్లలోనో, స్ట్రయిట్ షాట్లలోనో హీరోలు కనిపించేవారు. అయితే ఆ తర్వాత చిరంజీవి తరం నుండి పరిస్థితులు మారాయి. డూప్‌లు లేకుండా మన హీరోలు యాక్షన్ సీన్స్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన హీరోలు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఇటీవల కాలంలో మన హీరోలు చిన్నపాటి గాయాలపాలవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా..
ఎక్కడో తప్పిదాలు జరిగి దెబ్బలు తింటున్నారు. ఈ నేపథ్యంలో కుర్ర స్టార్లు డూప్‌లవైపు వెళ్తున్నారని టాక్. దీంతో సినిమా ఫైట్ల విషయంలో ప్రేక్షకులకు ఒకప్పటి మజా ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. రియల్ ఫైట్లను చూసి ఎంజాయ్ చేసిన వారికి.. డూప్ ఫైట్లు ఎంతవరకు కిక్ ఇస్తాయి అనేది తెలుస్తుంది. అయితే ఏయే సినిమాల హీరోలు డూప్‌లు పెడుతున్నారనేది త్వరలో తెలుస్తుంది.