కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమందికి సహాయం చేసి సోనూసూద్ మంచి మనస్సును చాటుకున్నారు. తన సేవా కార్యక్రమాల ద్వారా సోనూసూద్ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడం ద్వారా సోనూసూద్ పేదల పాలిట దైవంగా మారారు. కొంతమంది సోనూసూద్ సేవా కార్యక్రమాలపై విమర్శలు చేసినా సోనూసూద్ మాత్రం తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన బిందుప్రియ, కృష్ణ దంపతులకు సంవత్సరం వయస్సు ఉన్న బాబు ఉన్నాడు.
పుట్టినప్పటి నుంచి ఆ బాబు గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు. వైద్యులు ఆపరేషన్ చేయడానికి ఏకంగా ఆరు లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పగా అంత డబ్బు లేకపోవడంతో కృష్ణ దంపతులకు చిన్నారికి వైద్య చికిత్స అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కృష్ణా జిల్లాకు చెందిన జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు చిన్నారి ఆరోగ్య సమస్య గురించి సోనూసూద్ కు చెప్పగా చిన్నారి ఫ్యామిలీ మెంబర్స్ ను సోనూసూద్ ముంబైకు రప్పించారు. ముంబైలోని వాడియా ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స జరగగా ప్రస్తుతం బాబు ఆరోగ్యం బాగుందని వైద్యులు చెబుతున్నారు.
కష్టాల్లో ఉన్న పేదలకు సహాయం చేస్తూ మంచి మనస్సును చాటుకుంటున్న సోనూసూద్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. చిన్నారి ప్రాణాలను కాపాడినందుకు సోనూసూద్ కు కృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు సోనూసూద్ కు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. సోనూసూద్ కీలక పాత్రలో నటించిన ఆచార్య వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.