నేను మొదటినుండి భిన్నమైన సినిమాలే చేస్తూ వచ్చాను. ఈ కథకి ఇతనే ఫర్‌ఫెక్ట్ ఛాయిస్ అనే లాంటి సినిమాలే చేయాలనుకుంటున్నాను. అలాగే రెగ్యులర్ క్యారెక్టర్స్ కన్నా ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను అని అంటున్నారు యువ కథానాయకుడు హవీశ్. హీరోగా ఢిపరెంట్ సినిమాలు చేస్తు ప్రేక్షకుల మెప్పుపొందారాయన. హీరోగానే కాకుండా నిర్మాతగా రాక్షసుడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజతో ఖిలాడి సినిమా నిర్మిస్తున్న యంగ్ హీరో హవీష్ పుట్టినరోజు జూన్ 25. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు..
లాక్‌డౌన్ ఎలా గడిచింది?
– లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడాను. అలాగే నా వల్ల మా పేరెంట్స్‌కి కరోనా వస్తుందేమో అని భయంతో దాదాపుగా రెండున్నర నెలలుగా వారికి దూరంగా ఉంటున్నాను. బర్త్‌డే కాబట్టి వెళ్లి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారి బ్లెసింగ్ తీసుకుంటాను. అలాగే లాక్‌డౌన్‌లో ఓటీటీలో చాలా సినిమాలు చూశాను. కొన్ని స్క్రిప్ట్స్ కూడా విన్నాను.
కరోనా వల్ల ఈ సారి బర్త్‌డే ప్లాన్స్‌లో ఎలాంటి చేంజెస్ జరిగాయి?
– నాకు నార్మల్‌గానే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సినిమాల్లోకి రాక ముందు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకునేవాడిని కాదు కాని ఇక్కడికి వచ్చాక, మా యూనిట్, మీడియా వారితో కలిసి సెలబ్రేట్ చేసుకునేవాన్ని అయితే ఈ సారి కరోనా కారణంగా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్‌తో జరుపుకుంటున్నాను.
లాక్‌డౌన్‌లో స్క్రిప్ట్స్ విన్నాను అని చెప్పారు కదా ఏమైనా ఫైనల్ చేశారా?
– చేశానండి! ప్రస్తుతానికైతే మూడు స్క్రిప్ట్స్ ఫైనల్ చేశాను. ముందు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా చేస్తున్నాను. ఒక కొత్త కాన్సెప్ట్. కథ చాలా బాగా నచ్చింది. దాని తర్వాత వెంటనే ఒక యాక్షన్ లవ్‌స్టోరీ, ఆ తర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్లో ఒక యాక్షన్ మూవీ చేస్తున్నాను. ఈ మూడు వేటికవే భిన్నమైన స్క్రిప్ట్స్. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.
ఫస్ట్ నుండి డిఫరెంట్ సినిమాలే చేస్తూ వస్తున్నారు రీజనేంటి?
– నేను మొదటినుండి భిన్నమైన సినిమాలే చేస్తూ వచ్చాను. ఈ కథకి ఇతను ఫర్‌ఫెక్ట్ ఛాయిస్ అనే లాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే రెగ్యులర్ క్యారెక్టర్స్ కన్నా ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను. తక్కువ సినిమాలు చేయడానికి అది కూడా ఒక కారణం. అయితే ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలను ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇకనుండి కొంచెం స్పీడ్‌గా సినిమాలు చేస్తాను.
హీరోగా చేస్తూనే ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూస్తున్నారు కదా ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
– చిన్నప్పటి నుండి బిజినెస్ ఫ్యామిలీ అవడం వల్ల ప్రొడక్షన్ అనేది నాకు ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదు. బిజినెస్ అంటే మనం అక్కడే ఉండి చేయాలి అనేది నేను నమ్మను. మంచి టీమ్ ఉంటే అన్ని పనులు సక్రమంగానే జరుగుతాయి. ఫైనల్ గా ఆడిట్ కరెక్ట్‌గా చూసుకుంటూ మనం చేయాల్సిన పని చేస్తే చాలు.
హైదరాబాద్‌లో స్టూడియో, యూనివర్సిటి కట్టాలనేది మీ డ్రీమ్ అని విన్నాం?
– కూకట్‌పల్లిలో ఒక స్టూడియో, అలాగే ఒక యూనివర్సిటి కూడా ప్లాన్ చేస్తున్నాం. స్టూడియోలో పవన్‌కళ్యాణ్‌గారి సినిమాకు అలాగే రవితేజ గారి సినిమాలకి సెట్స్ వేశాం. అక్కడే గ్రీన్ స్క్రీన్ స్టూడియో కూడా కట్టబోతున్నాం. ఒక యూనివర్సిటి విషయానికి వస్తే అది ఏషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటిగా ఉండాలని ప్లాన్ చేశాం. నా డ్రీమ్ అనేం కాదు మా తాతగారి, మా నాన్నగారి లెగసీని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది.
మీ ప్రొడక్షన్‌లో వస్తోన్న ఖిలాడి ఎలా ఉండబోతుంది?
– ఖిలాడి సినిమా రవితేజ గారి కెరీర్‌లోనే ఇంతవరకూ చూడని స్టైలిష్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. రవితేజగారి కిక్ సినిమాకంటే ఇంకా స్టైలిష్ ఫిల్మ్. సినిమా చాలా బాగా వచ్చింది. దాంతో పాటు అక్షయ్ కుమార్ గారితో రాక్షసుడు సినిమా రీమేక్ చేయాల్సి ఉంది. అయితే ఈ కరోనా కారణంగా ఆ రైట్స్ అక్షయ్ కుమార్‌గారికే ఇచ్చాం. ప్రస్తుతం ఖిలాడి పూర్తవగానే వెంటనే ఒక స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేశాం. ఇక నుండి మా ఏ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్స్‌లో పెద్ద హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేయబోతున్నాం.