దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ ట్రైలర్ వచ్చేసింది. ఈరోజు రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభిమానుల సమక్షంలోనే ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రాధే శ్యామ్ చిత్రాన్ని గోపి కృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి.
ఇప్పటికే విడుదలైన విక్రమాదిత్య టీజర్..ఈ రాతలే, నగుమోము, సంచారి వంటి పాటలు సినిమా పై అంచనాల్ని పెంచాయి. జనవరి 14 న సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న రాధే శ్యామ్ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి ..చాలా రోజుల తర్వాత ప్రభాస్ రొమాంటిక్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఫ్లర్టేషన్ షిప్ మాత్రమే అతను కోరుకునే వ్యక్తి అని మొదట్లో చూపించారు.
అయితే అటు తర్వాత అతను ప్రేరణ అనే అమ్మాయితో డీప్ గా ప్రేమలో పడడం జరుగుతుందని తెలుస్తుంది. 70ల కాలం నాటి ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడిగా కనిపించనున్నాడు.ప్రతీ ఒక్కరి పుట్టుక నుండీ చావు వరకు జరిగే అన్ని విషయాలు ఇతనికి తెలుస్తాయి. అందుకోసమే గొప్ప గొప్ప నాయకులు ఇతన్ని కలుస్తుంటారని కృష్ణంరాజు పాత్ర ద్వారా చెప్పించారు. అతని శాస్త్రం శాసనం అనే డైలాగ్ కూడా ఉంది.
అయితే ఇతని ప్రియురాలు అయిన పూజా హెగ్డే కి ప్రాణగండం ఉంటుందని తెలుసుకుని ఇతను అనుభవించే మానసిక పరిస్థితుల్ని ట్రైలర్ లో చూపించారు.విజువల్స్, బి.జి.ఎం చాలా బాగున్నాయి. కాకపోతే ప్రభాస్ నుండీ ఆశించే ఫైట్ లు మాత్రం లేకపోవడం నిరాశ కలిగించే అంశం. అయినప్పటికీ ట్రైలర్ బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :