తెలుగు నుండి వచ్చిన తొలి పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ అనే చెప్పాలి. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో ప్రభాస్ ఓవర్‌నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ ఇమేజ్ ఎంత పని చేసిందీ అంటే… ఆ సినిమాల తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేయాలి అనేంతగా పరిస్థితి మారింది. దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ కూడా ముడుతోంది లెండి. తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే… ఒక్కో సినిమాకు వంద కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్.
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధమవుతుండగా, ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇది కాకుండా నాగ్ అశ్విన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ‘రాంబో’లో నటిస్తున్నాడనే వార్తలూ వస్తున్నాయి. ఈ లిస్ట్‌లో ఒక్కో సినిమాకు ₹100 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడని టాక్. ‘రాధే శ్యామ్’ సొంత సినిమా కాబట్టి… ఆ మొత్తంలో వాటా తీసుకుంటాడనుకోండి. మిగిలిన వాటిని రెమ్యూనరేషనే. అయితే ప్రభాస్ ఇంత తీసుకోవడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
ఎందుకంటే ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజివే. అందుకు తగ్గట్టే భారీ తారాగణంతో తెరెక్కుతున్నాయి. కథ, నేపథ్యం తదితరాలు కూడా భారీగానే ఉంటాయి. దీంతో సినిమాలకు భారీ వసూళ్లు గ్యారెంటీ. అందుకే ప్రభాస్‌కు అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారని టాక్. ఇలాంటి విషయాలు అధికారికంగా ప్రకటించరు కాబట్టి… పుకార్లను వార్తలు అనుకోవడమే.