సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడంటే తమిళంలోనే సినిమాలు చేస్తూ వాటిని పాన్ ఇండియా రేంజిలో జనాలకు అందిస్తున్నారు కానీ… ఒకప్పుడు ఆయన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాళీ, ఇంగ్లిష్‌లో నటించారు. పూర్తి నిడివి ఉన్న పాత్రలు కాకపోయినా… అతిథి పాత్రల్లో అయినా మెరిసేవారు. హిందీ విషయానికే తీసుకుంటే… ఆయన ఆఖరిగా 2011లో ‘రా.వన్’లో నటించారు. ఇప్పుడు హిందీ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? ఆయన 13 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి.
ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా తెలిపారు. దీంతో ‘బాలీవుడ్ సీనియర్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా.. తమిళ అగ్ర కథానాయకుడు రజనీకాంత్ చేతులు కలిపారు’ అంటూ ఇండియన్ సినిమా ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఇద్దరూ కలసి ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసి సాజిద్ నడియాడ్‌వాలా ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఈ సినిమా తమిళంలో రూపొందుతుందా? లేక హిందీలో చేస్తారా? అనేది స్పష్టం చేయలేదు. అయితే సాజిద్ సినిమాలన్నీ హిందీలోనే ఉంటాయి కాబట్టి… ఈ సినిమా బాలీవుడ్‌లోనే వస్తుంది అంటున్నారు.
‘దిగ్గజ నటుడు రజనీకాంత్‌తో కలసి పని చేయడం నాకొక గౌరవం. కలకాలం గుర్తుంచుకునే మా ప్రయాణం మొదలు కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటడం ఖాయం’’ అని సాజిద్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అంటూ రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఎక్కడా ఎలాంటి సమాచారం అధికారికరంగా లేదు. (Rajinikanth) రజనీకాంత్ చివరిసారి ‘లాల్ సలామ్’ సినిమాలో కనిపించారు.
ప్రస్తుతం ఆయన జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది అని సమాచారం. అలాగే ‘జైలర్ 2’ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. మరి ఇప్పుడు సాజిద్ నిర్మిస్తున్న సినిమా ఎప్పుడు, ఎలా వస్తుంది అనేది చూడాలి.