సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ (మాజీ ట్విటర్)లో చాలా యాక్టివ్‌గా ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. సమాజంలోని చాలా విషయాల గురించి ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. సమాజంలో వస్తున్న మార్పులు, వైరల్ అంశాల గురించి ఆయన పోస్టులు పెడుతుంటారు. ఇటీవల ఆయన తన సంస్థకు చెందిన ఓ సేవా కార్యక్రమం గురించి చేసిన ఓ పోస్ట్‌కు ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్ ఓ కామెంట్ చేశారు. దానికి తిరిగి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.
‘‘సుజీత్ పెళ్లికి నన్ను ఎందుకు ఆహ్వానించలేదు’’ అని రామ్ చరణ్ (Ram Charan) … ఆనంద్ మహీంద్రా ట్వీట్ కింద కామెంట్ చేశారు. ‘‘గందరగోళంలో పడి మర్చిపోయా’’ అంటూ మహీంద్రా రిప్లై కూడా ఇచ్చారు. దీంతో ఎవరా సుజీత్ అనే చర్చ ఒకటి మొదలైంది. దీంతో ఆ పోస్టు సంగతేంటో చూద్దాం అంటూ నెటిజన్లు వాళ్ల ప్రొఫైల్స్‌కి వెళ్లి చూస్తున్నారు. వెళ్లి చూశాక అసలు సంగతి ఇదా అంటూ నవ్వుకుంటున్నారు. దాంతోపాటు ఆ మంచి పనిని మెచ్చుకుంటున్నారు.
అసలు విషయం ఏంటంటే… 2040 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారడమే ఆనంద్ మహీంద్రా టీమ్ లక్ష్యం. ఈ విషయాన్ని చెబుతూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. కొన్నేళ్ల క్రితం తెలంగాణ జహీరాబాద్‌లో మహీంద్రా ప్యాక్టరీ నిర్మించారు. అక్కడ లక్షలాది చెట్లు నాటారని, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా నిర్మించారని ఆ వీడియోలో పేర్కొన్నారు. దాని వల్ల అక్కడ అండర్‌గ్రౌండ్ వాటర్ లెవల్ 400 అడుగులు పెరిగిందని చెప్పుకొచ్చారు.
ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి కారణంగా బ్రహ్మచారిగా ఉన్న సుజీత్ అనే కుర్రాడి పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిపారు. దీంతో రామ్‌చరణ్ ‘‘ఆనంద్ మహీంద్రా.. సుజీత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? జహీరాబాద్ దగ్గర్లోనే నేను ఉండేది. ఆ ప్రాంతంలో నా స్నేహితులను సరదాగా కలిసేవాడిని. ఇది గ్రేట్ వర్క్’’ అని పోస్ట్ పెట్టారు. దీనిపై మహీంద్రా స్పందిస్తూ ‘‘నేనూ అంగీకరిస్తున్నా. కన్‌ఫ్యూజ్ అయ్యి గురయ్యా. నీకు ఆహ్వానం పంపించడం మర్చిపోయా’’ అని రాశారు.