హీరో – హీరోయిన్ మధ్యలో రొమాన్స్ గురించో, ఆసక్తికర సన్నివేశాల గురించో ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. కానీ హీరో వయసు.. హీరోయిన్ వయసు.. ఇద్దరి మధ్య గ్యాప్ గురించి ఇప్పుడు ఓ చర్చ నడుస్తోంది. ఆ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) అయితే.. ఆ హీరోయిన్ రష్మిక మందన (Rashmika Mandanna) . టాపిక్ అదే కాబట్టి ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 31. మురుగదాస్ (A.R. Murugadoss) దర్శకత్వంలో రూపొందిన ‘సికందర్’ (Sikandar) గురించే ఈ చర్చంతా. రంజాన్ సందర్భంగా ఈ నెల 30న ‘సికందర్’ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. అప్పుడే ఈ సినిమా హీరో హీరోయిన్ల వయసు తేడా గురించి ప్రశ్న వచ్చింది. దానికి సల్మాన్ ఖాన్ స్పందిస్తూ ఆమెకు లేని ఇబ్బంది మీకెందుకు అని అన్నాడు. దీంతో ఈ చర్చ మరింత సాగింది అని చెప్పాలి. నాకు, హీరోయిన్‌కి మధ్య 31 ఏళ్ల వయసు తేడా ఉందని కొందరు అంటున్నారు.
హీరోయిన్‌కు గానీ, ఆమె తండ్రికి గానీ లేని సమస్య మీకెందుకు? రష్మికకు పెళ్లి అయ్యి అమ్మాయి పుట్టాక ఆమె కూడా స్టార్ అవుతుంది. ఆ పాపతో కూడా కలసి నటిస్తాను. అప్పుడు రష్మిక అనుమతి తప్పనిసరిగా తీసుకుంటా అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అంటే ఈ వయసు గ్యాప్ అంశాన్ని సల్మాన్ వదిలేలా లేడు అన్నమాట. నిజానికి హీరో – హీరోయిన్ మధ్య ఏజ్ గ్యాప్ అంశం ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా నడుస్తోంది.
కొత్త హీరోయిన్, సీనియర్ హీరో కలసి సినిమా చేసినప్పుడల్లా ఇదే చర్చ. ఇప్పుడు ‘సికందర్’ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇంత జరిగినా హీరోయిన్లు కానీ, హీరోలు కానీ కాంబినేషన్‌ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. గ్యాప్‌తో మాకేం పని.. ఎంటర్‌టైన్‌చేయడమే మా పని అంటూ సినిమాలు ఓకే చేసుకుంటూ వెళ్తున్నారు.