కష్టపడి సినిమా తీసినవాళ్లకు, చేసినవాళ్లకు.. ఆ సినిమా బాగోలేదు అంటే కోపం వస్తుంది. రివ్యూలు వాళ్లకు నచ్చాలని లేదు, నచ్చేలా రాయాలనీ లేదు. అయితే రివ్యూ నచ్చలేదని.. రాసినోళ్లను నోటికొచ్చింది అనేస్తే ఓకేనా? ఇప్పుడు తెలుగు సినిమాలో, తెలుగు సినిమా మీడియాలో ఈ విషయం మీదే చర్చ జరుగుతోంది. సినిమా గురించి వాళ్లకు నచ్చని విధంగా రాశారని.. ఆ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) నోటికొచ్చింది అనేశారు. అయితే వరుస నిరసనల వల్ల ఆయన ఇప్పుడు ఓ మెట్టు దిగారు.
Srikanth Iyengar
సినిమా రివ్యూయర్లపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) స్పందించారు. వారందరికీ త్వరలోనే క్షమాపణలు చెబుతానని వీడియో విడుదల చేశారు. అయితే సారీ చెప్పకుండా.. సారీ చెబుతా అని ఓ వీడియో రిలీజ్ చేయడం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. క్షమాపణ చెప్పే సమయంలో ఏదైనా మెలిక పెడతారా? లేక ఇంకేదైనా ఆలోచన చేస్తున్నారా అనే డిస్కషన్ నడుస్తోంది. ఇక అసలు విషయం చూస్తే..
అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రధాన పాత్రలో రూపొందిన ‘పొట్టేల్’ (Pottel) సినిమా సక్సెస్ (?) మీట్ ఇటీవల జరిగింది. ఆ సినిమాలో ఓ పాత్రలో నటిచిన శ్రీకాంత్ అయ్యంగార్ వేదిక మీద మాట్లాడుతూ.. సినిమా రివ్యూలు రాసే వారిపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అసభ్యకరమైన పదజాలం కూడా వాడేశారు. ఒక పదం అంటే నోరు జారింది అని అనుకోవచ్చు. మొత్తం ఆయన స్పీచ్‌లో ఇలాంటి మాటలే ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌కు రివ్యూయర్ల / క్రిటిక్స్ సంఘం ఫిర్యాదు కూడా చేసింది. సినిమా ఎలా రూపొందించాలో తెలియని వారంతా రివ్యూలు రాస్తున్నారని, సినిమా సమీక్షలు ఆపేయాలని శ్రీకాంత్ అయ్యంగర్ వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా ఆ లేఖలో క్రిటిక్స్ సంఘం పేర్కొంది. మరి కారణమేంటో కానీ.. ఇప్పుడు ‘పొట్టేల్’ సినిమా సక్సెస్ మీట్‌లో నేను కొన్ని మాటలు మాట్లాడాను. అందరికీ త్వరలోనే క్షమాపణలు చెబుతాను. దయచేసి వేచి ఉండండి అని ఇప్పుడు చెప్పారు.