స్మగ్లింగ్ అంటే చాలా రకాలు ఉంటాయి. దందాలు అంటే కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే మన తెలుగు సినిమాల్లో దందా అనగానే డ్రగ్స్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ముఖ్యంగా తమిళ సినిమాల్లో డాన్‌లు, డెన్‌లు అంటే డ్రగ్స్ పేరు వచ్చేస్తుంటుంది. అలాంటి సినిమాలు తీయడంలో రీసెంట్‌గా సిద్ధహస్తుడు అయ్యారు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) . లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఆయన సృష్టిస్తున్న ఓ ప్రపంచంలో హీరోలు, విలన్లు డ్రగ్స్ చుట్టూనే తిరుగుతుంటారు. అయితే ఆయన కొత్త సినిమాలో ప్లాన్ మారింది అంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో (Rajinikanth) లోకేశ్ కనగరాజ్ కొత్త సినిమా ఉంటుంది అని ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా టీజర్ పోస్టర్ కూడా వచ్చేసింది. అందులో రజనీకాంత్‌ను చూస్తుంటే.. కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని అర్థమైపోతోంది. 171వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో రజనీ కాస్త నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు అని లోకేశ్ ఇప్పటికే చెప్పారు. అయితే అదేంటి అనేది చెప్పలేదు. ఈ విషయంలో ఏప్రిల్ ఆఖరులో పూర్తి క్లారిటీ వస్తుంది అని అంటున్నారు.
అయితే ఈలోపు ఫ్యాన్స్ ఆ సినిమా పోస్టర్‌ను, దర్శకుడు, అతని టీమ్ చెబుతున్న విషయాలను డీకోడ్ చేసి కొన్ని ఆసక్తికర చర్చలకు తెర తీస్తున్నారు. ఆ ప్రకారం చూస్తే… ఈ సినిమాలో డ్రగ్స్ అనే ప్రస్తావనే ఉండదు అని అంటున్నారు. బంగారం స్మగ్లింగ్, విలువైన వస్తువుల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది అని చెబుతున్నారు. దానికి ఉదాహరణగా పోస్టర్‌లో గోల్డ్ వాచీలు పెట్టారు అని అంటున్నారు. మామూలుగా లోకేశ్ కనకరాజ్ ఫేవరెట్ జోనర్ క్రైమ్ డ్రామా.
క్రైమ్, డ్రగ్స్ లేకుండా లోకేశ్ సినిమానే తీయరు అంటుంటారు. అలాగే ఆయన సిద్ధం చేసుకున్న లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. ఈ సమయంలో రజనీకాంత్‌తో వేరే తరహా కథతో సినిమా ఏమైనా చేస్తారా అనే డౌట్ వస్తోంది. అయితే ఇది డబుల్ బ్లఫ్ అని, ఇలా బంగారం చూపించినా ఆఖరులో ఎల్‌సీయూలోనే ఈ సినిమా ఉంటుంది అని కొందరు లెక్క కడుతున్నారు.
ఆ చర్చ పక్కనపెడితే ఈ సినిమాలో రజినీకాంత్ మాఫియా డాన్‌గా కనిపిస్తారట. సింగపూర్, దుబాయి, అమెరికా లాంటి దేశాల నుండి మన దేశానికి గోల్డ్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది అనే పాయింట్ చుట్టూ ఈ కథ ఉంటుంది అంటున్నారు. ఈ సినిమా జూన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ చేస్తారట.