ఈమధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ చానల్స్ క్రియేట్ చేస్తున్న రచ్చకీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం బాధపడాల్సి వచ్చిన పరిస్థితిని చూసే ఉంటాం. కోటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ అయితే.. ఏకంగా మీడియా ముందు ఈ యూట్యూబ్ చానల్స్ గురించి కన్నీళ్లు పెట్టుకొన్నాడు. సెలబ్రిటీలను ఆస్థాయికి దిగజారుస్తున్నాయి కొన్ని యూట్యూబ్ చానల్స్. సీనియర్ ఆర్టిస్ట్ అయిన కోటా శ్రీనివాసరావు పరిస్థితే అలా ఉంటే ఇక సమంత సిచ్యుయేషన్ ఏంటో అర్ధం చేసుకోండి. ఇటీవల సమంత మరియు నాగచైతన్య ఓ కుక్కపిల్లను కొనుక్కొన్నారు. ఆ ఫోటోలను తమ ట్విట్టర్ ఎకౌంట్ లో షేర్ చేసి అందరికీ తెలియజేశారు. సమంతకి ముందు నుంచీ కుక్కపిల్లలంటే చాలా ఇష్టం కావడం, ఆమె అత్త అమల బ్లూక్రాస్ మెంబర్ కావడంతో ఇదంతా సర్వసాధారణం అనుకోండి.
అయితే.. సమంత అలా ట్వీట్ పెట్టిందో లేదో, కొన్ని యూట్యూబ్ చానల్స్ తమ వ్యూస్ కోసం “సమంత తల్లయ్యింది” అనే హెడ్డింగ్ తో వీడియోస్ రిలీజ్ చేశాయి. సదరు వీడియోల్లో కొన్ని ట్రెండింగ్ లోకి కూడా వచ్చాయి. దాంతో నాగార్జున తాతయ్యాడేమో అనుకున్నారందరూ. కొందరైతే అక్కినేని కుటుంబ సభ్యులకి కాల్ చేసి మరీ వివరాలు అడిగి తెలుసుకొన్నారట. దాంతో షాక్ అవ్వడం అక్కినేని ఫ్యామిలీ వంతయ్యింది. దాంతో వాళ్ళందరూ డబ్బుల కోసం కక్కుర్తిపడొచ్చు కానీ.. మరీ ఇంతలా ఉండకూడదు అని సదరు యూట్యూబ్ చానల్స్ ని తిట్టుకొంటున్నారట.