పేరులో ఏముంది? అని కొట్టిపారేయొద్దు. సినిమా కథ కూడా ఒక్కోసారి పేరుతో తెలిసిపోతుంది అంటారు. అందుకే సినిమా పేరు విషయంలో మన నిర్మాతలు చాలా కుస్తీలే పడుతుంటారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద పేర్లు పెట్టడం బాలీవుడ్‌కి అలవాటు అయితే, షార్ట్ అండ్ స్వీట్‌గా లేదంటే షార్ట్ అండ్ ఘాటుగా పేర్లు పెట్టడం టాలీవుడ్‌కి అలవాటు. ఇటీవల కాలంలో ఈ పొట్టి పేర్ల సంస్కృతి మొదలైంది. గతంలో చిన్న పేర్లతో సినిమాలొచ్చినా.. ఇప్పుడు ఎక్కువైపోయింది. కొన్ని షార్ట్‌ఫామ్‌లో చిన్నపేర్లగా వస్తుంటే, కొన్ని పేర్లే చిన్నవిగా ఉన్నాయి.
చిన్న పేర్ల సంస్కృతి మన దగ్గరే కాదు, బాలీవుడ్‌లోనూ మంచి విజయాలు అందిస్తోంది. దీంతో భవిష్యత్తులో విడుదల కాబోతున్న సినిమాల పేర్ల విషయంలోనూ షార్ట్ నెస్‌కి ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో మూడు అక్షరాలు ఉండేలా మన దగ్గర సినిమాల పేర్లు వస్తున్నాయి. పలకడానికి ఈజీగా ఉండటం, పూర్తి పేరును ముక్కలు ముక్కలు చేయడం ఇష్టం లేక ఇలా చేస్తున్నారో లేక అవే కుదిరాయో కానీ.. పొట్టి పేరు బాగుండటమే కాదు, విజయాలు కూడా అందిస్తోంది.
కావాలంటే మీరే చూడండి.. తెలుగులో ఇప్పుడు విడుదలవుతున్న, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పేర్లు పొట్టిగానే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. తారక్ – రాజమౌళి – రామ్‌చరణ్‌ల ‘ఆర్‌ఆర్ఆర్’ అంటే పెద్ద పేరు ఉందనే విషయం తెలిసిందే. అయితే పొట్టి పేరు అలవాటు అయింది. సుకుమార్ – బన్నీ కలసి ‘పుష్ప’రాజ్‌గా వచ్చి ఫుల్ కిక్ ఇచ్చారు. యశ్ – ప్రశాంత్ నీల్ ‘KGF’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాని త్వరలో ‘దసరా’ అంటూ మూడు అక్షరాలతోనే వస్తున్నాడు.
ప్రభాస్ ‘సలార్’, ‘స్పిరిట్’.. రజనీకాంత్ ‘జైలర్’ పేర్ల గురించి మళ్లీ చెప్పక్కర్లేదు. అఖిల్ అక్కినేని భారీ విజయం కోసం వస్తున్న సినిమా ‘ఏజెంట్’ కూడా చిన్న పేరే. ‘వరిసు’ / ‘వారసుడు’తో వచ్చి భారీ విజయం అందుకున్న విజయ్ కూడా తర్వాత ‘లియో’ అంటూ రెండు అక్షరాలే. ‘పఠాన్’ లాంటి పొట్టి పేరుతో మోస్ట్ అవైటెడ్ విజయం అందుకున్న షారుఖ్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఇదే స్టైల్ ఫాలో అవుతున్నాడు. ‘జవాన్’, ‘డుంకీ’ అంటూ వస్తున్నాడు.
‘కిసీ కీ బాయి.. కిసీ కీ జాన్’ అంటూ చాంతాండత పేరుతో వస్తున్న సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాకు ‘టైగర్’ అనే పొట్టి పేరు పెట్టుకున్నాడు. ఇవే కాదు ఇంకా క్లారిటీ లేని కొన్ని సినిమాల పేర్లు చూస్తే పవన్ కల్యాణ్ నెక్స్ట్ సినిమాల పేర్లు చూస్తే ‘దేవర’ / ‘దేవుడు’.. ‘ఓజీ’. ఇవి కూడా పొట్టి పేర్లే. కాబట్టి పొట్టి పేరు గట్టి ప్రచారం.. సూపర్ హిట్ భారీ వసూళ్లు.