హీరోగా ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేసి.. ఎట్టకేలకు ‘పెళ్లి చూపులు’ సినిమాతో తన కలల్ని నిజం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాల్లో ఎవరూ గుర్తుపట్టని నటుడిగా, అందరూ గుర్తించిన నటుడిగా కొన్ని చిన్న పాత్రలు చేశాడు. ఇక ‘అర్జున్ రెడ్డి’తో తన కంటూ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకుని దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ‘గీత గోవిందం’ సినిమాతో కుటుంబ ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆ తర్వాత.. అదేంటి ‘ఆ తర్వాత’ అనేసి ఆగిపోయాం అనుకుంటున్నారా? ఏమైందో విజయ్ కూడా అక్కడే ఆగిపోయాడు అనే ఫీలింగ్ ఉంది.
నిజానికి, విజయ్ దేవరకొండ చాలా సాధించాడు. ఆయన ఎంచుకున్న కథలు, పాత్రలు ఎవరూ ట్రై కూడా చేయలేదు. అయితే ఆయన చుట్టూ ముసురుకున్న నెగిటివిటీ, బ్యాడ్ వైబ్స్ ఆయన కష్టాన్ని బూడిదపాలు చేసేలా ఉంది. ఈ మాట మేం అనడం లేదు. ఆయనే అనుకుంటున్నాడట. అంతలా అంతర్మథనంలో ఉన్నాడట విజయ్. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితుల దగ్గర అంటున్నాడట. అసలేమైంది నేను ఏం మాట్లాడినా తప్పుగా తీసుకుంటున్నారు అని బాధపడిపోతున్నాడట. ఈ విషయాన్ని ఆయనతో సినిమా చేస్తున్న నిర్మాత నాగవంశీ చెప్పారు.
విజయ్ దేవరకొండను ప్రేక్షకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదని నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తన సినిమాలు ప్రేక్షకాదరణను సొంతం చేసుకోలేకపోతున్నాయని విజయ్ బాధ పడుతున్నట్లు నాగవంశీ చెప్పారు. తాను ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని విజయ్ బాధపడుతున్నాడని కూడా నాగవంశీ చెప్పుకొచ్చారు. మామూలుగా అయితే స్వశక్తి మీద పూర్తిగా ఎదిగిన హీరోలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. దానికి రవితేజ, నానినే ఉదాహరణ. కానీ విజయ్ అలా ఎదిగినా నెగిటివిటీ తప్పడం లేదు.
దానికి విజయ్ యాటిట్యూడ్ ఓ కారణమని అంటుంటారు. ఆయన సినిమా ప్రచారంలో చూపించే చిన్న జోరు నెగివిటీ పెరగడానికి ఓ కారణమవుతుంది అంటారు. మరి అంతర్మథనంలో విజయ్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడేమో చూడాలి. రీసెంట్‌గా అయితే వారసత్వ హీరోల గురించి చేసిన కామెంట్స్ చూస్తుంటే అంతర్మథనంలో ఇంకా ఈ విషయం అర్థమైనట్లు కనిపించడం లేదు. చూద్దాం తప్పు ఎక్కడ జరుగుతుందో విజయ్ తెలుసుకుంటాడేమో.