తరాలు మారినపుడు వచ్చే తారల వారసులతో పాటు సొంతంగానూ కొందరు పరిశ్రమకి వస్తుంటారు. వారిలో మొదటి అడుగు తడబడినా తర్వాత నిలదొక్కుకుంటారు కొందరు. ఇంకొందరు తొలి సినిమాలో మురిపించి కనుమరుగైపోతారు. హ్యాపీడేస్ తో వచ్చిన వరుణ్ ఆరంభంలో మెరిశాడు. నిఖిల్ ఎత్తుపల్లాలు చూస్తూ ప్రస్తుతం నిలదొక్కుకున్నాడు. ఇక నాని మాట సరేసరి. రాజ్ తరుణ్ కూడా యువహీరోల జాబితాలో చేరిపోయాడు. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో పరిశ్రమ దృష్టిలో పడ్డ విజయ్ దేవరకొండ ఎటు వెళతాడన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యంలో కీలక పాత్ర పోషించిన విజయ్ పెళ్ళి చూపులు సినిమాతో సోలో హిట్ కొట్టాడు. వెనువెంటనే ‘ద్వారక’ సినిమాతో మరోమారు బాక్సాఫీస్ ముందుకు రానున్న ఇతగాడికి బడా సంస్థల నుండి అవకాశాలు వస్తున్నాయి. వీటిలో సురేష్ ప్రొడక్షన్స్, యువి క్రియేషన్స్, వారాహి తదితరల అగ్ర సంస్థలన్నీ ఉన్నాయి. దర్శకురాలు నందినీ రెడ్డితోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. అవకాశాలకు లోటు లేదు కానీ కథల ఎంపికలో తడబడితే మాత్రం వచ్చిన అడ్వాన్సులన్నీ అవకాశాలతో సహా వెనక్కి వెళిపోతాయి. మరి ఈ హీరో తన విజయాలను తద్వారా అవకాశాలను ఏ మేరకు నిలుపుకుంటాడో చూడాలి.