ప్రపంచ సినిమాలో భారతదేశ సినిమాను, అందులోనూ తెలుగు సినిమా పరిశ్రమను నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఎవరూ ఊహించని వసూళ్లు సాధించి పెట్టింది. ఇండస్ట్రీ పరిశీలకులు చెబుతున్న ప్రకారం అయితే సినిమా బడ్జెట్ సుమారు ₹400 కోట్లు – ₹500 కోట్లు. అలాగే బాక్సాఫీసు దగ్గర సినిమా సాధించిన వసూళ్లూ ₹2400 కోట్లు – ₹2500 కోట్లు. అంటే సుమారు ₹2000 కోట్ల లాభం. మరి ఇంత సంపాదించిన నిర్మాతలు ఇప్పుడెక్కడ.
అంత భారీ వసూళ్లు సాధించాయి అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అసలు లెక్కలు ఎలాగూ మనకు తెలియవు కాబట్టి… వాటిని పక్కనపెట్టేద్దాం. ‘బాహుబలి’ లాంటి అంత పెద్ద సినిమా చేశాక, ఆ నిర్మాతలు మూడేళ్ల వరకు సినిమా తీయలేదు. ఆ తర్వాత కూడా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి చిన్న రీమేక్ సినిమా చేశారు. కరోనా పుణ్యమా అని దానిని కూడా ఓటీటీలో ఇచ్చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ‘పెళ్లి సందD’ చేస్తున్నారు. ఈ రెండూ ఆ బ్యానర్ స్థాయి సినిమాలు కావు.
ముందు సినిమా సరిగ్గా ఆడకపోయినా అప్పులు చేసి మరీ సినిమాలు తీసే నిర్మాతలు మనకు చాలామంది ఉన్నారు. అలాంటిది అన్ని వేల కోట్లు వసూళ్లు సాధించినా… తర్వాత ఒక్కటంటే ఒక్కటి భారీ సినిమాను ఓకే చేయలేదు అంటే ఏమనుకోవాలి. అలా అని సినిమా మీద ప్యాషన్ లేదా అంటే… ‘బాహుబలి’ లాంటి పెద్ద సినిమా చేసిన ఇంట్రెస్ట్ వారికి ఉంది. మరి ఎందుకు సినిమాలు అనౌన్స్ చేయడం లేదు. అంత పెద్ద సినిమా చేశాం కదా… కొన్నేళ్లు రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నారా ఏంటి? ఏమో వాళ్లకే తెలియాలి.