‘కేజీయఫ్’ (KGF) సినిమాల ద్వారా 2018 నుంచి యశ్ (Yash) మొత్తం దేశానికి తెలిశాడు. అయితే అతను సినిమాల్లోకి వచ్చి చాలా ఏళ్లయింది. అక్కడికి 11 ఏళ్ల క్రితమే అంటే 2007 సమయంలో అతను కన్నడ సినిమాకు పరిచయమయ్యాడు. దానికి మూడేళ్ల క్రితం అంటే 2004లో కన్నడ బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ విషయం పక్కన పెడితే ‘కేజీయఫ్’ సినిమాల్లో యశ్ నటనను చూసి యాటిట్యూడ్ ఎక్కువ అని అనుకుంటారు కొంతమంది.
నిజానికి ఈ మాట ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లోనే యశ్‌కు ఎదురైందట. యశ్‌కి పొగరు ఎక్కువ అని కూడా అనుకున్నారట. అప్పుడే ఆయన నవీన్ కుమార్ గౌడ నుండి యశ్ అయ్యారన్నమాట. దీని గురించి ఇటీవల ఆయనే చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో నటుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా శ్రమించాను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకునేవాణ్‌ని. అందుకే ఏదైనా ప్రాజెక్ట్ కోసం దర్శకులు నా దగ్గరకు వస్తే.. జాగ్రత్త కోసం పూర్తి స్క్రిప్ట్ గురించి అడిగేవాడిని అని చెప్పాడు యశ్.
అయితే తాను అలా అడగడం కొంతమందికి నచ్చలేదని, దాంతో వారు యశ్‌కు పొగరు అనే ముద్ర వేశారని చెప్పాడు. ‘స్క్రిప్ట్ చదవకుండా.. నేను ఎలా ఒక కథను నమ్మి సినిమా చేయగలను?’ అని నేను అనుకునేవాణ్ని. ఈ కారణంతోనే తొలినాళ్లలో ఎన్నో అవకాశాలు కోల్పోయా అని చెప్పాడు. అయితే ఆ సమయంలో నిర్మాత కృష్ణప్ప సపోర్ట్‌గా నిలిచారని చెప్పాడు యశ్. దర్శకుడు శశాంక్ పూర్తి స్క్రిప్ట్ ఇవ్వడంతోనే ‘మొగ్గిన మనసు’ చేశామని గుర్తు చేసుకున్నాడు.
Yash
యశ్ చిన్నతనం నుండే నటుడు కావాలని కలలు కన్నాడు. 16 ఏళ్ల వయసులో బెంగళూరు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాడు. నాటకాల్లో నటించాడు, సీరియల్ నటుడిగానూ చేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సహాయ నటుడిగా చేశాడు. ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమా చేస్తున్నారు. దీంతోపాటు బాలీవుడ్ ‘రామాయణ’ను నిర్మిస్తూ, నటిస్తున్నాడు.