‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి సినిమా ‘ది వ్యాక్సిన్ వార్’ షూటింగ్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, నానా పాటేకర్, పల్లవి జోషి వంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో సోమవారం నాడు నటి పల్లవి జోషికి గాయాలయ్యాయి. షూటింగ్ లో ఒక వాహనం అదుపుతప్పి పల్లవి జోషిని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అదృష్టవశాత్తు ఆమెకి పెద్ద గాయాలు అవ్వలేదు.
ప్రస్తుతం స్థానిక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. పల్లవి జోషి అంటే తెలుగు వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ నార్త్ ఆడియన్స్ కి మాత్రం ఆమె సుపరిచితురాలే. పలు మరాఠీ, హిందీ సినిమాల్లో నటించారామె. ‘ఇన్సాఫ్ కీ ఆవాజ్’, ‘అంధ యుద్ధ్’, ‘దాతా’, ‘సౌదాగర్’, ‘తలాష్’, ‘ఇన్సానియత్’, ‘ఇంతిహాన్’ ఇలాంటి హిట్టు సినిమాల్లో నటించారు పల్లవి జోషి. అలానే చాలా ఏళ్ల పాటు మరాఠీ సింగింగ్ రియాలిటీ షో.. సరిగమపని హోస్ట్ చేసింది.
ఆమె చివరిసారిగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. పల్లవి జోషి 1997లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ‘ది వ్యాక్సిన్ వార్’లో అనుపమ్ ఖేర్, నానా పాటేకర్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.
2023 ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.