బ్లాక్‌బస్టర్ సినిమా – డిజాస్టర్ సినిమా… ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా? ఏముంది విజయం సాధించిన సినిమా బ్లాక్‌బస్టర్, తలబొప్పి కట్టించే సినిమా డిజాస్టర్ అని చెప్పొచ్చు. అయితే బ్లాక్‌బస్టర్ సినిమాకు చాలా కారణాలు ఉన్నా ఒకటో రెండో అంశాలు బయటకు వస్తాయి, హైలైట్ అవుతాయి. అదే డిజాస్టర్ సినిమాకు ఒకరో ఇద్దరో కారణమైనా చాలా విషయాలు బయటకు వచ్చి ఇన్ని కారణాలు ఉన్నాయా అని కూడా వివరించొచ్చు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అనుకుంటున్నారా? ‘లైగర్’ సినిమా గురించే.
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేసన్‌లో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం ‘లైగర్’. వాట్ లాగే దేంగే అంటూ విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే దేశం మొత్తం చుట్టేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌లా కనిపిస్తున్నారు అంటూ ఒకటి రెండు కామెంట్లు వచ్చినా విజయ్ దేవరకొండ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే సినిమా ఫలితం వచ్చాక అసలు తత్వం బోధపడి కామ్ అయ్యాడు అనుకోండి. దీంతో ఇప్పుడు ఆ సినిమా గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు.
అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన అనన్య పాండే ‘లైగర్’ గురించి మాట్లాడింది. దీంతో ఆ సినిమా మళ్లీ చర్చలోకి వచ్చింది. ‘కాఫీ విత్ కరణ్’ అంటూ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఓ టాక్ షో చేస్తుంటారు. అందులో సినిమాల గురించి తక్కువ, మిగిలిన విషయాలు ఎక్కువగా ఉంటే… అయితే అనన్య పాండే ఎపిసోడ్‌లో ‘లైగర్’ ప్రస్తావన వచ్చింది. ‘లైగర్’ సినిమా డిజాస్టర్ గురించి ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ మాట్లాడారు. దానికి అనన్య మాట్లాడుతూ… ‘ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు’ అని కామెంట్ చేసింది.
‘లైగర్’ సినిమా చేయడం తన తప్పే అన్నట్లు చెప్పింది. అయితే తాను ‘లైగర్’ సినిమా చేయడానికి కరణ్ జోహార్, తన తల్లి భావనా పాండేనే కారణం అని చెప్పింది అనన్య. తన సినిమా విడుదలైన ప్రతిసారీ తన తల్లి భావనా పాండే నుండి ఫోన్ లేదా మెసేజ్ వస్తుందట. అయితే ‘లైగర్’ విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. తీరా ‘లైగర్’ ఎలా ఉందని అడిగితే… ‘ఫన్’ అని రిప్లై వచ్చిందట. తన సినిమాల విషయంలో తన తల్లి నుండి ఎప్పుడూ అంతటి చెత్త రివ్యూ రాలేదని (Ananya Panday) అనన్య చెప్పడం కొసమెరుపు.