నందమూరి బాలకృష్ణ మరోసారి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. 1991లో విడుదలైన ‘ఆదిత్య 369’ (Aditya 369) ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. తన పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ తాజా సీజన్‌లో ఈ అప్‌డేట్‌ను పంచుకున్నారు. డిసెంబర్ 6న ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానున్న ఈ ఎపిసోడ్‌లో బాలయ్య ఒక స్పెషల్ లుక్‌లో దర్శనమివ్వడం విశేషం.
Aditya 369
ఈ సారి బాలయ్య ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సూట్‌లో కనిపించి, అభిమానులను మరింత ఉత్సాహపరిచారు. “ఆదిత్య 369 (Aditya 369) తర్వాత ఎన్నో కథలు చెప్పాలని అనుకున్నా, ఇప్పుడు సీక్వెల్‌తో మా ఫ్యామిలీ నుంచి మరో హీరోను పరిచయం చేస్తున్నాను,” అని బాలకృష్ణ చెప్పారు. ఈ సీక్వెల్‌లో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. “మోక్షజ్ఞ ఈ సినిమాకోసం శిక్షణ తీసుకుంటున్నారు. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే సినిమా అవుతుంది,” అని బాలయ్య హింట్ ఇచ్చారు.
‘ఆదిత్య 369’ (Aditya 369) తెలుగు సినిమా చరిత్రలో మొదటి టైమ్ ట్రావెల్ కథతో రూపొందిన సినిమా. అప్పట్లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, సైన్స్ ఫిక్షన్ కథా చిత్రాలకు తెలుగులో మొదటి అడుగుగా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్‌ను కూడా అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సీక్వెల్‌కి దర్శకత్వం ఎవరు వహిస్తారన్నది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ముందుగా ఈ సీక్వెల్‌ను బాలయ్య స్వయంగా డైరెక్ట్ చేస్తారన్న వార్తలు వచ్చినా, ప్రస్తుతం అది మారినట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, అధికారిక సమాచారం కోసం వేచి చూడాల్సిందే. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను మరింత విస్తరించి, బాలయ్య-మోక్షజ్ఞ కాంబినేషన్‌ను భారీ స్థాయిలో ప్రెజెంట్ చేస్తారని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఆదిత్య 999 మ్యాక్స్’, బాలయ్య స్పెషల్ లుక్ నెట్టింట వైరల్ అవ్వడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ ప్రాజెక్ట్ తెలుగు సినిమా పరిశ్రమలోనే మరో రికార్డ్ గా నిలుస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది. 2025లో ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసి, 2026లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.