దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన మొదటి చిత్రం గమ్యం తోనే అందరి దృష్టిని ఆకర్షించారు. అయన చేసిన వేదం, కృష్ణమ్ వందే జగద్గురుమ్ వాస్తవ జీవితాలలోని అనేక కోణాలను సృష్టిస్తాయి. ఆయన సినిమా తీసే దృష్టి కోణం భిన్నంగా ఉంటుంది. దాదాపు 12 ఏళ్ల సినీ కెరీర్ లో క్రిష్ తీసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి చిత్రం ప్రత్యేకంగా నిలిచింది. క్రిష్ యొక్క మరో గొప్పతనం ఏమిటంటే ఆయన ఇప్పటికే రెండు పీరియాడిక్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి అనే భారీ పీరియాడిక్ మూవీ తక్కువ బడ్జెట్ లో తీశారు. 2017 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
ఇక బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ వీరగాథ మణికర్ణిక పేరుతో ఆయన దర్శకత్వంలో తెరకెక్కింది. ఎన్టీఆర్ బయోపిక్ కొరకు ఈ చిత్ర షూటింగ్ కొంత భాగం మిగిలి ఉండగానే ఆయన బయటకు రావడంతో మణికర్ణిక విషయంలో క్రెడిట్ కంగనా తీసుకున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా మరో పీరియాడిక్ మూవీని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29న అధికారికంగా మొదలైన ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా కొనసాగనుంది. ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మొఘలుల కాలం నాటి పీరియడ్ మూవీగా రూపొందుతుంది. ఈ విధంగా దర్శకుడు క్రిష్ మూడు పీరియాడిక్ చిత్రాలకు దర్శకుడిగా ఉన్నారు.