ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వరుణ్ తేజ్, హరీష్ శంకర్ల ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) చిత్రానికి మొదటి రోజు పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ దక్కాయి. మాస్ ఆడియన్స్ ను ఈ చిత్రం అలరిస్తుంది. ఇప్పటి వరకూ క్లాస్ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన వరుణ్ ఈ ఏడాది మొదట్లో ‘ఎఫ్2’ తో కామెడీ యాంగిల్ ట్రై చేశాడు. ఇప్పుడు ‘గద్దలకొండ గణేష్’ వంటి మాస్ పాత్ర చేసి విశ్వరూపం చూపించాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి వసూళ్ళు వస్తున్నాయి. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం చతికిల పడిపోయింది. నిర్మాతలైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట.. ఈ చిత్రాన్ని అక్కడ భారీ స్థాయిలో విడుదల చేశారు. వరుణ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్. అయితే ప్రీమియర్స్, మొదటి రోజు కలెక్షన్లు చూస్తే జాలిపడే పరిస్థితి. ‘అంతరిక్షం’ సినిమా ఎంత డిజాస్టర్ అయినా ‘$91K వసూళ్ళను రాబట్టింది. కానీ ‘గద్దలకొండ గణేష్’ చిత్రానికి మాత్రం అక్కడ కేవలం ‘$84K’ మాత్రమే రాబట్టింది. ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని అక్కడ ‘3.5’ కోట్లకు అమ్మారు. ఇప్పటి లెక్కల్ని బట్టి అక్కడ కేవలం 58 లక్షలు మాత్రమే రాబట్టింది. దీనికి ప్రధాన కారణం అక్కడ దర్శకుడు హరీష్ శంకర్ చిత్రాలకు మార్కెట్ లేకపోవడమే అని స్పష్టమవుతుంది. ఇక వీకెండ్ దాటితే ఈ చిత్రం నిలబడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అక్కడ ఈ చిత్రం ప్లాప్ గా మిగిలే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు.