చాలా మంది రైటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్… డైరెక్షన్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో డైరెక్షన్ ఛాన్స్ దక్కించుకోవడం.. తర్వాత డైరెక్టర్ గా నిలదొక్కుకోవడం అనేది చిన్న విషయం కాదు. అది వారికి పెద్ద సవాల్. అయితే కొంతమందికి అదృష్టవశాత్తు డైరెక్షన్ ఛాన్స్ ఈజీగానే దొరికేస్తూ ఉంటుంది. అయితే తర్వాత వాళ్ళు నిలదొక్కుకోవడానికి చాలా ఎత్తులు, పై ఎత్తులు వేస్తుంటారు. ప్రస్తుతం మనం ‘హరోం హర’ (Harom Hara) దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారకా (Gnanasagar Dwaraka)గురించి చెప్పుకుందాం.
సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన ‘హరోం హర’ సినిమా రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ అనేది పక్కన పెట్టేద్దాం. ఈ సినిమాలో హీరో ఎలివేషన్స్ బాగున్నాయి. మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉన్నాయి. దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారకాకి మంచి మార్కులే పడ్డాయి అని చెప్పొచ్చు. ఈ ‘కుర్ర డైరెక్టర్లో ఇంత మాస్ ఉందా?’ అనుకునే విధంగానే కొన్ని సన్నివేశాలు ఉంటాయి.
అయితే జ్ఞాన సాగర్ తన మొదటి సినిమా ‘సెహరి’ (Sehari) అని చెప్పుకున్నాడు. అంతేకాదు.. ‘అది లవ్ స్టోరీ అని.. ఆ సినిమా హీరో కథతోనే ఆ సినిమా తీశానని… ఇష్టం లేకుండానే ఆ సినిమాకి డైరెక్షన్ చేసానని.. రిలీజ్ తర్వాత ఆ సినిమాని చూడలేదని.. ఓటీటీలో అందుబాటులో ఉన్నా చూసే ప్రయత్నం చేయలేదని’ చెప్పుకొచ్చాడు జ్ఞాన సాగర్. ఇదిలా ఉంటే.. వాస్తవానికి జ్ఞాన సాగర్ మొదటి సినిమా ‘సెహరి’ కాదు… ‘ప్లేయర్’. అవును..ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో? ఎప్పుడు వెళ్లిపోయిందో చాలా మందికి తెలీదు.
యూట్యూబ్ లో ట్రైలర్ కూడా అందుబాటులో ఉంది. అయితే ‘సెహరి’ సినిమా ఇష్టం లేకుండా తీసినా దాని గురించి చెప్పుకున్నాడు జ్ఞాన సాగర్..! కానీ.. ‘ప్లేయర్’ సినిమా గురించి మాత్రం ఇతను ఎక్కడా చెప్పలేదు. అంతేకాదు.. ‘హరోం హర’ చిత్రీకరణ సమయంలో ‘ప్లేయర్’ సినిమా తాలూకు వివరాలు ఇంటర్నెట్లో ఉండకూడదు అని తన టీంతో చెప్పి మరీ.. ఆ సినిమాకి సంబంధించి చాలా వివరాలు డిలీట్ చేయించాడట ఈ కుర్ర డైరెక్టర్. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. ఇలాంటి ఎత్తులు, పై ఎత్తులు కూడా వేయాలేమో..!