ఒక వైపు శంకర్ డైరెక్షన్లో ‘భారతీయుడు 2’ చిత్రం చేస్తూనే మరోపక్క తన రాజకీయ సంబంధమైన వ్యవహారాలను కూడా చక్కబెడుతున్నారు యూనివెర్సల్ హీరో కమల్ హాసన్.అయితే ఇదే తన చివరి చిత్రమని ఇక తాను సినిమాల నుండీ తప్పుకుంటానని, పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని కొన్ని రోజుల క్రితం ఓ వేదిక పై కమల్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నిజంగానే కమల్ సినిమాలు మానేస్తారా? లేక ఊరికే అలా చెబుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విషయం పై కమల్ క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయం పై కమల్ మాట్లాడుతూ… “ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో నా పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఇది నా అభిమానులకు నిరాశను కలిగించే విషయమే. అలాంటి అభిమానులంతా నన్ను క్షమించాలి .. ఎందుకంటే సినిమాలు . రాజకీయాలు ఒకే సమయంలో చేయలేను. రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చాను గనుక, చేసేందుకు చాలా పనులు వున్నాయి. ఆ పనులన్నీ కూడా త్వరత్వరగా చేస్తూ ముందుకుసాగాలి” అంటూ చెప్పుకొచ్చారు. కమల్ మాటలను బట్టి చూస్తుంటే… ఇక అయన సినిమాలకు దూరమవ్వడం ఖాయమనే విషయం స్పష్టమవుతుంది.ఒకవిధంగా ఇది ఆయన అభిమానులకి చేదు వార్తనే చెప్పాలి.