ఈ వారం వచ్చిన అరడజను సినిమాల్లో చాలా సైలెంట్ గా వచ్చింది ‘కిస్మత్’ మూవీ. ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య హీరో కాగా అభినవ్ గోమఠం కూడా ఈ సినిమాలో నటించడంతో యూత్ దీనిపై దృష్టి పెట్టారు అని చెప్పాలి. టీజర్, ట్రైలర్స్ కూడా కామెడీగా అనిపించాయి. మరి సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: కార్తీక్ (నరేష్ అగస్త్య), అభి (అభినవ్ గోమఠం), కిరణ్ (విశ్వ దేవ్ రాచకొండ)… ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు నిరుద్యోగులు కావడంతో ఎప్పుడూ వీళ్ళ పేరెంట్స్ తో తిట్లు తింటూ ఉంటారు. చుట్టుపక్కల ఉండే జనాలు కూడా హేళన చేస్తూ ఉంటారు. ఆ అవమానాలు భరించలేక వీళ్ళ సొంత ఊరు మంచిర్యాలని విడిచి పెట్టి ఉద్యోగం వెతుక్కోవడానికి సిటీకి వస్తారు. ఓ పెంట్ హౌస్ ని రెంట్ కి తీసుకుంటారు. మరోపక్క జనార్ధన్ (అజయ్ ఘోష్) అనే రాజకీయ నాయకుడు 20 కోట్ల డబ్బు పోగొట్టుకుంటాడు. అది కాస్త అనుకోకుండా కార్తీక్,అభి, కిరణ్..లకు దొరుకుతుంది. ఆ డబ్బుతో పాటు వాళ్లకి అనేక సమస్యలు కూడా వచ్చి పడతాయి. అదెలా? చివరికి వీరు ఆ డబ్బుని దక్కించుకున్నారా లేక జనార్దన్ కి దొరికిపోయారా? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: నరేష్ అగస్త్య మరోసారి తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో పాస్ మార్కులు వేయించుకున్నాడు. అయితే అభినవ్ గోమఠం తన కామెడీ టైమింగ్ తో మరోసారి అలరించాడు అనే చెప్పాలి. సినిమా ఎక్కడైనా డౌన్ అవుతుంది అనే ఫీలింగ్ కలిగినప్పుడు తన మార్క్ డైలాగ్స్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. విశ్వ దేవ్ రొటీన్ క్యారెక్టర్ చేసినా ఓకే అనిపిస్తాడు. హీరోయిన్ రియా సుమన్ పాత్ర.. మరీ కథని ముందుకు తీసుకెళ్లేలా ఉండదు. కానీ తన వరకు ఓకే అనిపించింది. అజయ్ ఘోష్,’టెంపర్’ వంశీ పర్వాలేదు. అవసరాల శ్రీనివాస్ లేట్ గా ఎంట్రీ ఇచ్చినా అక్కడక్కడా నవ్వులు పూయించాడు. చమ్మక్ చంద్ర నటన జస్ట్ ఓకే. మిగిలిన నటీనటులు బాగానే చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ముగ్గురు స్నేహితులు ఉన్న క్రైమ్ కామెడీ మూవీస్ అనగానే అందరికీ ‘బ్రోచేవారెవరురా’ ‘జాతి రత్నాలు’ గుర్తుకొస్తాయి. వాటి స్థాయిలోనే ‘కిస్మత్’ ని రూపొందించాలి అని దర్శకుడు శ్రీనాథ్ బాదినేని చేసిన ఈ ప్రయత్నానికి మెచ్చుకోవచ్చు. కానీ పూర్తిస్థాయిలో అతను తన టేకింగ్ తో మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ఓకే. బాగానే టైం పాస్ అవుతుంది. కానీ సెకండ్ కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కూడా కొత్తగా ఏమీ ఉండదు. కామెడీ కనుక సెకండ్ హాఫ్ లో వర్కౌట్ అయ్యి ఉంటే కచ్చితంగా దీని ఫలితం మరోలా ఉండేదేమో.
సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ మాదిరిగా ఉంది అంతే..! ప్రొడక్షన్ వాల్యూస్.. ఇది చిన్న సినిమా అని చాలా సందర్భాల్లో గుర్తు చేస్తూనే ఉంటాయి. రన్ టైం 2 గంటల 8 నిమిషాలే ఉండటం కూడా ఈ సినిమాకి ఓ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.
విశ్లేషణ: మొత్తంగా ‘కిస్మత్’ అక్కడక్కడా నవ్వించే ఓ క్రైమ్ కామెడీ మూవీ.ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే టైం పాస్ చేయొచ్చు. ఓటీటీకి ఈ మూవీ పెర్ఫెక్ట్.
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus