సినిమా విడుదలైతేనే మీడియాలో కనిపించే హీరోయిన్లు కొంతమంది ఉంటారు. ఏ సినిమా లేకపోయినా నిత్యం మీడియాలో ఉంటే హీరోయిన్ అంటే కంగనా రనౌత్ అని చెప్పాలి. నిత్యం పరిశ్రమలో ఏదో విషయం మీద సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది. దానికి తోడు హృతిక్ రోషన్, కరణ్ జోహార్ టాపిక్‌లు ఎలానూ ఉన్నాయి. అయితే ఆమె గురించి, ఆమె గత జీవితం గురించి మాత్రం ఎక్కడా పెద్ద చర్చ ఉండదు. అందుకే హీరోయిన్ కాకముందు ఆమె ఆలోచనలు, కొన్ని వ్యక్తిగత విషయాలు మీ కోసం…
బాలీవుడ్ సూపర్‌స్టార్లంటే ఒంటికాలి మీద చిర్రున నిల్చునే కంగనకు.. ఇష్టమైన సినిమా షారుఖ్ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’. అయితే ఆ సినిమాను ఎప్పుడూ పూర్తిగా చూడలేదట. తెలుగులో ‘ఏక్ నిరంజన్’తో కెరీర్ ప్రారంభించిన కంగన మళ్లీ ఇటువైపు రాలేదు. అయితే మహేష్‌బాబుతో నటించాలని ఆమె కోరికట. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తోందట. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అని చాలామంది అనేవారు ఒకప్పుడు. కంగన కూడా ఆ బాపతే. డాక్టర్ కావాలని బైపీసీలో చేరింది. ఇంటర్ రెండో సంవత్సరంలో కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యింది. దీంతో మెడిసిన్ మీద ఆసక్తి పోయి సినిమా రంగంలోకి వచ్చేసింది.
సినిమాల్లోకి వెళ్తా అని కంగన ఇంట్లో చెబితే… సగటు భారతీయ తండ్రిలాగే తొలుత వ్యతిరేకించారట. సినిమా మాట ఎత్తితే చాలు గొడవ పడేవారట. అయితే ఇప్పుడు మాత్రం కంగన నటనను ఆమె తండ్రి మెచ్చుకుంటున్నారట. కంగన వరుసగా సినిమాల గురించి అడిగేసరికి ఓ రోజు కోపంతో ‘నిన్ను వేడుకుంటున్నా… దయచేసి ఇంట్లోంచి వెళ్లిపో’ అనేశారట. ఆయన అలా అన్నప్పుడు కంగనకు బాధేసిందట. దాంతో ఏడుస్తూనే ఇంట్లోంచి వచ్చేసి ముంబయికెళ్లే రైలు ఎక్కేసిందట. ముంబయిలో కష్టపడుతున్నానని తెలిసినా తండ్రి ఎప్పుడతూ ఆమెతో మాట్లాడలేదట. డబ్బులకు కష్టంగా ఉందని తెలిసినా పంపలేదట. ఇదీ కంగన ప్రీ స్టార్‌డమ్ కథ