“ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు” అనే పాత సామెతను మన ఇండస్ట్రీకి అవలంబిస్తే.. “సినిమా తీసి చూడు, ఆ సినిమాని ప్రమోట్ చేసి చూడు” అని సరికొత్త పర్యాయపదం వస్తుంది. సినిమా కంటే ఎక్కువ వినోదాన్ని పంచే సాధనాలు ఎక్కువ అయిపోవడంతో.. తమ సినిమాను జనాల్లో తీసుకెళ్ళడం ప్రస్తుతం హీరోహీరోయిన్లకి పెద్ద టాస్క్ అయిపోయింది. సినిమా ఎలా తీసినా పర్లేదు కానీ.. సదరు సినిమాను సరిగా ప్రమోట్ చేయకపోతే ప్రారంభవసూళ్ళు అటకెక్కినట్లే. ఈ విషయాన్ని బాలీవుడ్ ఎప్పుడో గమనించింది అందుకే సినిమాలు ఏడాది పాటు తీసినా ప్రమోషన్ కోసం కనీసం రెండు నెలలైనా వెచ్చిస్తున్నారు. హీరోహీరోయిన్స్ డేట్స్ డీల్ రాసుకొనేప్పుడు ప్రమోషన్ కోసం ఇన్ని రోజులు అంటూ అగ్రిమెంట్ లోనే పొందుపరుస్తున్నారు.
ఈ పద్ధతిని ఇప్పుడు టాలీవుడ్ కూడా పాటించడానికి ప్రయత్నిస్తోంది. అయితే.. “నేనే రాజు నేనే మంత్రి” టీం మాత్రం ఈ పద్ధతిని బాగా ఉపయోగించుకోంటోంది. హీరో వాడిన పంచె మొదలుకొని హీరోయిన్ మెడలో కనిపించే బంగారు నగ వరకూ అన్నీ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ కావడంతో సదరు వస్తువులు షూటింగ్ కోసం ఫ్రీగా ఇచ్చిన “రామ్ రాజ్ కాటన్స్, టి.బి.జి జ్యూయలర్స్” సంస్థలు తమ యాడ్స్ అండ్ ప్రమోషన్ కోసం “నేనే రాజు నేనే మంత్రి” విజువల్స్ ను విచ్చలవిడిగా వాడడం వల్ల, ఏ టీవి చూసినా రాణా, కాజల్, నేనే రాజు నేనే మంత్రి కనిపిస్తున్నాయి. దాంతో జనాలు కూడా మిగతా రెండు సినిమాలకంటే ఈ చిత్రాన్ని చూడడానికే సుముఖత చూపుతున్నారు. పాజిటివ్ టాక్ లభించడం పెద్ద ప్లస్ అనుకొంటున్న ఈ తరుణంలో మంగళవారం వరకూ లాంగ్ వీకెండ్ కూడా లభించడంతో.. నిన్న రాత్రి షో వరకూ హౌస్ ఫూల్ కలెక్షన్లతో సందడి చేసిన “నేనే రాజు నేనే మంత్రి” ఈ వారం తమిళ, మలయాళ వెర్షన్స్ కూడా విడుదలకానున్నాయి. చూస్తుంటే.. రాణా ఖాతాలో మరో వంద కోట్ల సినిమా చేరేలా ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.