ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2 The Rule) ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తీవ్ర దుస్థితికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ తన ప్రాణాలు కోల్పోగా, ఆమె కొడుకు శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ ఘటన కారణంగా అల్లు అర్జున్ తో పాటు పాటు థియేటర్ యాజమాన్యం అలాగే నిర్మాతలపై కేసు నమోదు చేశారు.
Pushpa 2 The Rule
పుష్ప 2 ప్రీమియర్ షోకు వచ్చిన అభిమానులతో భద్రతా లోపాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నంలోనే తొక్కిసలాట జరిగిందని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ పరిణామాల మధ్య జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) రంగంలోకి దిగింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీకి నోటీసులు జారీ చేసింది.
న్యాయవాది రామారావు ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులో, అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు రావడం, భద్రత లోపాలు, పోలీసుల చర్యలే ఈ సంఘటనకు కారణమని పేర్కొన్నారు. ఇక ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్ సీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు నాలుగు వారాల గడువు ఇచ్చింది. సంఘటన వివరాలు, తీసుకున్న చర్యలు, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
డిసెంబర్ 4న RTC క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ఆ థియేటర్ కు రావడంతో అభిమానులు ఆయనను చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భద్రతా లోపాలు, భయంతో పరుగులు పెట్టిన వారితో తొక్కిసలాట జరిగి రేవతి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్ హెచ్ ఆర్ సీ ఆదేశాలు వెలువడిన వెంటనే విచారణ ప్రారంభమైంది. పోలీసుల నివేదిక ఏం చెప్పబోతోందన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.