మలయాళ సినిమా పరిశ్రమలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల జాబితా తీస్తే… అందులో కచ్చితంగా ఉండే పేరు పృథ్వీరాజ్ సుకుమారన్. మ్యాన్లీగా, మంచి హైట్‌లో అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడు. అయితే సినిమాల ఎంపిక విషయంలో మాత్రం తన స్టైల్ మామూలుగా ఉండదు. ఎంతటి స్టార్ అయినా ప్రయోగాలకు వెనుకాడడు. దర్శకత్వం కూడా ఉండటంతో వైవిధ్యమైన సినిమాలు చేస్తాడు. అయితే ఇటీవల ఓకే చేసి, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన సినిమా గురించి అభిమానులు, ప్రేక్షకులు వావ్ అంటూనే, వామ్మో అంటున్నారు.
పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) ప్రస్తుతం ‘సలార్’ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా సంగతి పక్కనపెడితే… ‘ఆడుజీవితం’ అనే మరో సినిమా చేశాడు. అమలాపాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకుడు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సమయంలో టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్, వీడియో చూస్తే ఇదేం మాస్ రా మామా అంటూ మాట్లాడుకుంటున్నారు. పైన మీరు చూసిన ఫొటో అందులోనిదే మరి.
‘మనుగడ కోసం చేస్తున్న సాహసం.. నమ్మశక్యం కాని ఓ నిజమైన కథ.. ‘ఆడుజీవితం’’ అంటూ సినిమా మీద అంచనాలు పెంచేసింది టీమ్. ఏప్రిల్ 10, 2024న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇందులో నజీబ్ అనే పాత్రలో బానిస జీవితాన్ని అనుభవిస్తున్న వలస కూలీగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తాడు. 90ల కాలంలో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ జీవిత కథను సినిమాలో చూడొచ్చు. విదేశాలకు వలస వెళ్లిన వ్యక్తులు బతకటం కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు అనేది సినిమాలో చూపిస్తారట.
మనుషుల పాస్ పోర్టులు లాక్కొని మరీ వారిని బానిసలుగా ఎలా మార్చుకుంటారనేది ‘ఆడు జీవితం’ సినిమాలో చూపిస్తామని టీమ్ చెప్పింది. ఆ పోస్టర్‌లో చింపురు జుట్టు, గుబురు గడ్డంతో పృథ్వీరాజ్‌ను చూస్తే… ‘ఇదేంటి ఇలా ఉన్నాడు’ అని కొందరు అంటుంటే… ‘విక్రమ్ ఏమన్నా పూనాడా’ అని మరికొందరు అంటున్నారు. మలయాళం, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ చేస్తారు. ఇంగ్లిష్‌లో ‘ది గోట్ లైఫ్’ పేరుతో సినిమా వస్తుంది.