వరుస విజయాలతో దూసుకెళ్లడంతో పాటు మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకుంటూ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగలిగారు సుమంత్ అశ్విన్. ఆయన హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘రైట్ రైట్’. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఆర్డినరీ’ స్ఫూర్తి తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాహుబలి` ఫేమ్ ప్రభాకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రానికి జె.బి. పాటలు స్వరపరిచారు.
శ్రీమణి సాహిత్యం అందించగా. హైమత్ పాడిన “అల్లి బిల్లి చెక్కిలి గిల్లి.. రెక్కలే విప్పెను లిల్లి..’ అనే తొలి పాట వీడియోను సోమవారం హైదరాబాద్ లో హీరో రామ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ – ”ఈ పాట చాలా బాగుంది. సుమంత్ అశ్విన్ ఫస్ట్ సినిమా నుంచి నటనలో వైవిధ్యం కనబరుస్తున్నాడు. ఈ చిత్రం తనకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. జేబీ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాటలో సుమంత్ అశ్విన్ తో పాటు ‘బాహుబలి’ ప్రభాకర్ స్టెప్స్ వేయడం భలే గమ్మత్తుగా అనిపించింది” అన్నారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ – ”ఈ సినిమా కోసం నేను ఫస్ట్ టైమ్ లుంగీ కట్టాను. నాన్నగారు లుంగీ వేసుకుని ఇంట్లో భలే స్టెప్స్ వేస్తుంటారు. లుంగీతో అలా స్టెప్ట్ ఎలా వేస్తారా? అనిపించింది. ఇప్పుడు స్వయంగా నేను లుంగీ కట్టి, స్టెప్స్ వేశాను. జేబీ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఈ సినిమా అత్యధిక భాగం అరకులో చిత్రీకరించాం. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత అరకు అంత అందంగా కనబడింది ఈ సినిమాలోనే అని నా ఫీలింగ్. కెమేరామన్ శేఖర్ వి. జోసఫ్ ఫొటోగ్రఫీ హైలైట్ గా నిలుస్తుంది” అని తెలిపారు.
నిర్మాత జె.వంశీకృష్ణ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలున్నాయి. అన్ని పాటలకూ జేబీ మంచి స్వరాలందించారు. చిత్రీకరణ కూడా బాగుంటుంది. ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఓ ఆర్టీసీ బస్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. ఇటీవలే విడుదల చేసిన ప్రచార చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. మే 7న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా
పాటలను విడుదల చేస్తున్నాం’` అని చెప్పారు.
దర్శకుడు మను మాట్లాడుతూ – “మలయాళం `ఆర్డినరీ` సినిమా స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాం. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేశాం. ఇందులో `బాహుబలి` ప్రభాకర్ డ్రైవర్‌గా, సుమంత్ అశ్విన్ కండక్టర్‌గా కనిపిస్తారు. `సుమంత్ అశ్విన్ కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. `లవర్స్`, `కేరింత` సినిమాల సక్సెస్‌లో ఉన్న ఆయనకు ఈ సినిమా గుర్తుండిపోతుంది. నాజర్ చాలా అద్భుతమైన పాత్రను పోషించారు. తొలి సగం వినోదాత్మకంగా సాగుతుంది. మలి సగంలో మిస్టరీ ఉంటుంది’` అన్నారు.
‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ – ”ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందులో నాది చాలా మంచి పాత్ర. ఈ పాటలో స్టెప్స్ వేయడం నాకే తమాషాగా అనిపించింది” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంగీతదర్శకుడు జేబి, గాయకుడు హైమత్, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్, చిత్రసమర్పకుడు వత్సవాయి వెంకటేశ్వర్లు, సహనిర్మాత జె. శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.