శంకర్ (Shankar) సినిమాలు అంటే భారీతనం పక్కా. అది సినిమా ఖర్చు, కాస్ట్ అండ్ క్రూ విషయంలోనే కాదు.. సినిమా నిడివిలోనూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఆయన నుండది వస్తున్న సినిమాలను చూస్తే ఎవరైనా ఈ మాట చెప్పేస్తారు. ఆయన బడ్జెట్ విషయంలో ఒక అడుగు వెనక్కి వేసి ఉండొచ్చు కానీ.. నిడివి విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అయితే ‘గేమ్ ఛేంజర్’(Game Changer) కోసం ఆయన ఈ పని చేశారు అని చెబుతున్నారు.
Game Changer
‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫైనల్ నిడివి ఎంత అనే విషయంలో దాదాపు ఓ క్లారిటీకి వచ్చారు అని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో సినిమా అడ్వాన్స్డ్ బుకింగ్స్ నేపథ్యంలో సినిమా నిడివి విషయం బయటకు వచ్చింది. అనూహ్యంగా సినిమా ఫైనల్ కట్ 2 గంటల 40 నిమిషాలు ఉండేలా చూసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఓ ఐదారు నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఇటీవల కాలంలో ఇదే తక్కువ అనొచ్చు.
మొన్నీమధ్యే వచ్చిన ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) నిడివి ఏకంగా 3 గంటల 20 నిమిషాలకు పైనే. ఈ క్రమంలో కొంతమంది ప్రేక్షకులు నిడివి విషయంలో ఇబ్బంది పడ్డారు అని గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, శంకర్ స్టైల్‌లోనే ఆలోచిస్తారా? అనే ప్రశ్నలు వచ్చాయి. ఆ ఫీడ్ బ్యాక్ వల్లనో లేక ఇంకే కారణమో కానీ సినిమా నిడివి అయితే తక్కువ ఉండేలా చూసుకుంటున్నారట.
ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయానికొస్తే.. వచ్చే జనవరి 10న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఈ నెల 21న అమెరికాలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆ తర్వాత మన దేశంలో కూడా భారీగా ప్రచారం చేయనున్నారు.