శ్రీవిష్ణు (Sree Vishnu) సినిమా అంటే మినిమమ్ ఉంటుంది. సినిమా ఫలితంలో తేడా ఉండొచ్చు కానీ.. వైవిధ్యం కోసం ఆయన చేసే ప్రయత్నంలో మాత్రం తేడా అస్సలు ఉండదు. అలా ఇప్పుడు ఆయన నాలుగు పాత్రలతో చేస్తున్న ప్రయోగం ‘శ్వాగ్’ (Swag). ‘సామజవరగమన’(Samajavaragamana) , ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) సినిమాల విజయాల తర్వాత శ్రీవిష్ణు నుండి వస్తున్న సినిమాగా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) ఫేమ్ హసిత్ గోలి (Hasith Goli) చేసిన రెండో సినిమా ఇది.
Sree Vishnu
అక్టోబరు 4న థియేటర్లలోకి ఈ సినిమా రానున్న నేపథ్యంలో శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అచ్చ తెలుగు సినిమా అని చెబుతున్నారు మరి ‘శ్వాగ్’ అని పేరు ఎందుకు పెట్టారు అని చాలామంది అడుగుతున్నారని.. ఈ సినిమా కథ శ్వాగణిక వంశానికి చెందినదని.. ‘శ్వాగణిక వంశానికి సుస్వాగతం’ అని పెడితే పెద్ద పేరు అవుతుందని శ్వాగ్ అని పెట్టామని చెప్పాడు. నాలుగు పాత్రలు చేశారు కదా.. ఏది మీకు సవాలు విసిరింది అని అడిగితే..
సింగ పాత్ర మాత్రమే ఈజీగా ఉందని, మిగిలి మూడు పాత్రలు సవాలు విసిరాయి అని చెప్పారు. కింగ్ భవభూతి పాత్రకు మోనో లాగ్స్ ఉన్నాయని, భాష కూడా గ్రాంధికం మిక్స్ అయి ఉంటుందని.. అందుకే ఆ పాత్ర ఇంకా ఎక్కువ సవాలు విసిరింది అని చెప్పుకొచ్చాడు. 90 ఏళ్ల వయసున్న ఓ పాత్ర కోసం ప్రోస్థటిక్ మేకప్ వేసుకున్నానని చెప్పిన ఆయన.. వేసుకోవడానికి నాలుగు గంటలు.. తీయడానికి రెండు గంటలు పట్టేది అని చెప్పారు.
మరి సీక్వెల్స్ ఆలోచన చేస్తున్నారా అంటే.. సీక్వెల్స్ లేవు కానీ.. సినిమాలో ముఖ్య పాత్ర ప్రతి ఒక్కదానికి బ్యాక్‌స్టోరీతో చేయొచ్చు అని అన్నారు. అయితే అవి ఉంటాయా? లేక ఆలోచన మాత్రమే ఉందా? అనేది సినిమా రిలీజ్ అయి, సాధించిన ఫలితం బట్టి తెలుస్తుంది. కాబట్టి మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది.