రజనీకాంత్‌ను (Rajinikanth) నటుడిగానే కాకుండా ఓ మనసున్న వ్యక్తిగా భావిస్తుంటారు ప్రేక్షకులు. కొందరైతే అతనినో ఓ మానవాతీత శక్తి అని కూడా అంటుంటారు. ఆయన మీద ఆ రేంజిలో ప్రేమను చూపిస్తుంటారు మరి. తాజాగా ఇలాంటి ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు సీనియర్ నటి షీబా ఆకాశ్‌దీప్. రజనీకాంత్‌తో గతంలో ఆమె ‘అతిశయ పైరవి’ అనే సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా అనుభవాలను ఇటీవల చెప్పుకొచ్చారామె. షీబా ఆకాశ్‌దీప్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే ‘అతిశయ పైరవి’ కావడం గమనార్హం.
షీబా ఆకాశ్‌దీప్ ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్‌గ ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తొలి సినిమాలోనే రజనీకాంత్‌కు జోడీగా నటించడంపై ఆమెకు ప్రశ్న ఎదురవ్వగా.. నాటి షూట్ రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షాకయ్యానని అందరిలానే చెప్పుకొచ్చారామె. రజనీకాంత్ మంచి వ్యక్తి. స్టార్ హీరో అయినప్పటికీ అందరితో స్నేహంగా ఉండేవారు అని చెప్పారు షీబా ఆకాశ్‌దీప్.
‘అతిశయ పైరవి’ సినిమా సమయంలో ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉండేవారని, ఆయనై ఆ అభిమానులకు ఉన్న ఇష్టాన్ని చూపించిన తీరు చూసి ఆశ్చర్యపోయానని చెప్పారామె. కేవలం ఆయన్ని చూడటం కోసమే తెల్లవారుజామున నాలుగు గంటలకు వేల మంది అభిమానులు సెట్‌కు వచ్చేవారని చెప్పారు. రజనీకంత్ నడిచే దారిలో మట్టిని అభిమానులు తీసుకెళ్లేవారని గుర్తు చేసుకున్నారు షీబా. ఆయనను అంత పవిత్రంగా భావించేవారు అని ఆమె మాటల ఉద్దేశం.
అలాగే కొంతమంది అభిమానులు భారీ పూల దండలు తీసుకొచ్చి భక్తితో వేసేవారని చెప్పారామె. ఆ సినిమా తర్వాత రజనీని (Rajinikanth) పెద్దగా కలవలేదని, కానీ కొన్నేళ్ల క్రితం ఒక ఈవెంట్‌లో చూసి తన దగ్గరకు వచ్చి పలకరించారు అని షీబా చెప్పుకొచ్చారు. ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ తనను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు ఎంతో సంతోషంగా అనిపించింది కూడా చెప్పారామె. 1988లో చిరంజీవి (Chiranjeevi) హీరోగా వచ్చిన ‘యముడికి మొగుడు’కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే ‘అతిశయ పైరవి’. ఈ సినిమా 1990లో విడుదలైంది.