సినిమా పరిశ్రమలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఇది అందరికీ తెలుసు. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే వస్తున్నాం. ప్రముఖ దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. ఇటీవల మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, క్యాన్సర్ తో ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో వంటి వారు మరణించారు. ఈ షాక్ ..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత జవాజి వెంకట రామారావు అలియాస్ తేనెటీగ రామారావు ఈరోజు మృతి చెందారు. ఆయన వయసు 68 ఏళ్ళు కావడం గమనార్హం. కొన్నాళ్ళుగా ఆయన లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు(అంటే మే 4, 2025న) మృతి చెందారు. తేనెటీగ రామారావుకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
గతంలో ఈయన రాజేంద్రప్రసాద్ తో ‘తేనెటీగ’ అనే సినిమా తీశారు. అప్పటి నుండి ఆ సినిమా పేరుని తన పేరుగా మార్చేసుకున్నారు రామారావు. తర్వాత వంశీ దర్శకత్వంలో రూపొందిన నరేష్ – వాణి విశ్వనాథ్ లతో ‘ప్రేమ & కో’, శివకృష్ణతో ‘బొబ్బిలి వేట’, ‘బడి’ వంటి స్ట్రైట్ సినిమాలు నిర్మించారు. అలాగే పలు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక తేనెటీగ రామారావు మరణం టాలీవుడ్ కు తీరని లోటు అంటూ టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.