ఒక సూపర్ స్టార్‌ను వెండితెర మీద చూసి మురిసిపోయారు వెనకటి తరం సినిమా అభిమానులు. అయితే ఇద్దరు సూపర్‌స్టార్లను ఒకే ఫ్రేమ్‌లో చూసి ఆనందించారు ఈ తరం సినిమా జనాలు. తండ్రీ కొడుకులు కలసి సినిమాల్లో నటించడం ఎప్పటి నుండో ఉన్నా.. అలాంటి సినిమాలు ఎక్కువగా చేసింది మాత్రం ఘట్టమనేని తండ్రీకొడుకులే అని చెప్పాలి. కృష్ణ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న రోజుల్లోనే మహేష్‌బాబును సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. కలసి కొన్ని సినిమాల్లో నటించారు. మహేష్ హీరో అయ్యాక, అందులో కృష్ణ ముఖ్య పాత్రలు చేశారు.
కృష్ణ, మహేష్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూసే అదృష్టం ప్రేక్షకులకు పది సార్లు కలిగింది. ఇద్దరు సూపర్‌స్టార్లు అలరించింది ఈ దిగువ పది సినిమాల్లోనే. అన్నట్లు ఓ హీరో కొడుకు సినిమాల్లో తమ్ముడిగా నటించడం మీరెప్పుడైనా చూశారా? అది కృష్ణ – మహేష్‌బాబు సినిమాల్లో చూడొచ్చు.
* ‘పోరాటం’ (1983) అనే సినిమాతో కృష్ణ – మహేష్‌బాబు కాంబో మొదలైంది. ఈ సినిమా నాటికి మహేష్‌కి ఆరేళ్లే. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కృష్ణకి తనయుడిగా మహేష్ కనిపించాడు.
* అక్కడికి నాలుగేళ్ల తర్వాత ‘శంఖారావం’ సినిమా (1987)లో కృష్ణ, మహేష్ మరోసారి తండ్రీకొడుకులుగా నటించారు. ఈ సినిమాకు దర్శకుడు కృష్ణ కావడం విశేషం.
* ఆ తర్వాతి ఏడాది కృష్ణ తన ఇద్దరు కొడుకులతోనూ నటించారు. 1988లో వచ్చిన ‘ముగ్గురు కొడుకులు’ సినిమాలో కృష్ణ తన ఇద్దరు బిడ్డలు రమేష్, మహేష్‌తో నటించారు. ఈసినిమాకి కూడా కృష్ణనే దర్శకుడు. పద్మాలయ బ్యానర్‌లో ఘట్టమనేని నాగరత్నమ్మ ఈ సినిమాను నిర్మించారు.
* కృష్ణ కెరీర్‌లో అద్భుతమైన చిత్రాల జాబితాలో ‘కొడుకు దిద్దిన కాపురం’ కచ్చితంగా ఉంటుంది. ఆ సినిమాలో కృష్ణ – విజయశాంతి నటించారు. అందులో కృష్ణ తనయుడిగా మహేష్ కనిపిస్తాడు. 1989లో వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో రికార్డులు కొట్టింది.
* కృష్ణ తొలిసారి బాండ్ తరహా పాత్ర చేసిన చిత్రం ‘గూఢచారి 117’. ఈ సినిమాలో మహేష్‌బాబు కూడా నటించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృష్ణ గూఢచారిగా అదరగొట్టాడు.
* కొడుకు తండ్రిగా తమ్ముడిగా నటించిన సినిమా అని చెప్పాం కదా. అది ‘అన్న తమ్మడు’. 1990లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణకు తమ్ముడిగా మహేష్ కనిపిస్తాడు.
* రమేశ్ బాబు హీరోగా రూపొందిన ‘బజారు రౌడీ’ (1990) సినిమాలో కృష్ణ అతిథి పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో మహేష్ బాలనటుడిగా కనిపించాడు.
మహేష్ హీరో అయ్యాక…
* పైవన్నీ మహేష్ హీరో కాకముందు సినిమాలు. 1999లో ‘రాజకుమారుడు’ సినిమాతో మహేష్ హీరో అయ్యాడు. తొలి సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు కృష్ణ.
* మహేష్‌ను కౌబాయ్‌గా చూపించిన చిత్రం ‘టక్కరి దొంగ’. ఈ సినిమా క్లైమాక్స్‌లో మరో కౌబాయ్‌గా కృష్ణ కనిపిస్తారు.
* ఇక మహేష్ – కృష్ణ కలసి కనిపించిన ఆఖరి చిత్రం ‘వంశీ’. బి.గోపాల్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో కృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించారు. అన్నట్లు ఈ సినిమాలో నమ్రత శిరోద్కర్ కూడా నటించడం గమనార్హం. కొడుకు, కోడలు (అప్పటికి కాలేదు)తో కృష్ణ నటించిన సినిమా ఇదే.